మనందరికీ తెలుసు... నిజామాబాద్‌లో ఏం జరుగుతుందో... పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగడం... సిట్టింగ్ ఎంపీ కవిత పట్ల తమ నిరసన తెలిపేందుకు... నిజామాబాద్ లోక్ సభ స్థానానికి బరిలో దిగాలని రైతులు నిర్ణయించుకోవడం... నామినేషన్లు వెయ్యడం... మొత్తం 186 మంది అభ్యర్థులు బరిలో నిలవడం... ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇంతవరకూ ఓకే. మరి అంతమంది బరిలో ఉంటే... వాళ్లందరికీ గుర్తులు కేటాయించాలి. ప్రస్తుతం ఉన్న ఈవీఎంలలో ఒక్కో దాంట్లో 64 అభ్యర్థులకు గుర్తులు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఈ ఈవీఎంలు నిజామాబాద్ లోక్ సభ స్థానానికి సెట్ కావు. అందువల్ల సంప్రదాయ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తారన్న ప్రచారం జరిగింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం టెక్నాలజీతో సమస్యను పరిష్కరించాలని నిర్ణయించింది. సో, నిజామాబాద్‌లో సాధారణ ఈవీఎంలు కాకుండా... M-3 (మెగా-3) ఈవీఎంలు వాడబోతున్నారన్న మాట. ఇప్పుడు వాటి ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
* M-3 ఈవీఎంలో మొత్తం 384 మంది అభ్యర్థులకు ప్రత్యేక గుర్తులు, బటన్లూ ఉంటాయి (నోటాతో సహా). అందువల్ల నిజామాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో ఒక్కో పోలింగ్ బూత్‌లో ఇలాంటివి ఒక్కో ఈవీఎంను ఉంచుతారన్నమాట. అందువల్ల 186 మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు వీలవుతుంది.
* మన దేశంలో ఇలాంటి ఈవీఎంలు చాలా తక్కువగా ఉన్నాయి. నిజామాబాద్‌లో 1788 పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. అంటే... 1788... ఎం-3 ఈవీఎంలు కావాలి.
* దేశంలో ఉన్న అన్ని M-3 ఈవీఎంలను నిజామాబాద్ తెప్పించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది.
* M-3 అత్యంత అధునాతనమైనవి కావడంతో... వీటి తయారీలో మరో ప్రత్యేకత ఉంది. ఏంటంటే వీటిని ఎవరైనా ట్యాంపరింగ్ చెయ్యాలని ప్రయత్నిస్తే... సడెన్‌గా పనిచెయ్యడం మానేస్తాయి. తద్వారా ట్యాంపరింగ్ వేషాలు తన దగ్గర కుదరవని వార్నింగ్ ఇస్తాయన్నమాట.
* 2017 ఆగస్టు నుంచీ ఎం-3 ఈవీఎంల ఉత్పత్తి జరుగుతోంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) సంస్థలు వీటిని తయారుచేస్తున్నాయి.
* M-3 ఈవీఎం యంత్రాలు తమను తాము నిరంతరం చెక్ చేసుకుంటూ ఉంటాయి. దీన్నే సెల్ఫ్-డయాగ్నోస్టిక్ ఫీచర్ అంటున్నారు. చెకింగ్ సమయంలో ఏదైనా తేడా జరిగినట్లు వాటికి అనిపిస్తే చాలు... వెంటనే పనిచెయ్యడం మానేస్తాయి. వాటిలో అలాంటి సాఫ్ట్‌వేర్ సెట్ చేశారు.
* సాధారణంగా ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్ అని రెండు విభాగాలుంటాయి. ట్యాంపరింగ్ చెయ్యాలనుకునేవారు... ఈ రెండింటిలో ఏదో ఒకటి వేరేది తెచ్చి సెట్ చేస్తారు. ఐతే... M-3 యంత్రాలు... నిరంతరం కంట్రోల్ యూనిట్, బ్యాలట్ యూనిట్ విభాగాలను కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా విభాగాన్ని మార్చితే, వెంటనే కమ్యూనికేషన్ ఆగిపోతుంది. అంటే ట్యాంపరింగ్ జరిగినట్లు మిషన్‌కి అర్థమైపోతుంది. అది పనిచెయ్యడం మానేస్తుంది.
* M-3 ఈవీఎంలలో GPS విధానం కూడా ఉంది. వాటిని ఎవరైనా ఎత్తుకుపోయినా, ఎక్కడైనా దాచేసినా, పోలీసులు, ఎన్నికల అధికారులూ ఈజీగా కనిపెట్టేస్తారు.
ఇన్ని మంచి లక్షణాలున్న M-3 ఈవీఎంలను మనం భవిష్యత్తులో అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ చూస్తాం. ప్రస్తుతానికి నిజామాబాద్ ప్రజలు ఆ అదృష్టాన్ని పొందబోతున్నారన్నమాట.
ఇవి కూడా చదవండి :
నిజామాబాద్‌లో బ్యాలెట్ కాదు.. ఈవీఎంలతోనే పోలింగ్
Pics : రాకెట్ల ప్రయోగాన్ని కళ్లారా చూసే ఛాన్స్... ఇస్రో కల్పిస్తున్న అద్భుత అవకాశం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Lok Sabha Elections 2019, Evm tampering, Telangana Lok Sabha Elections 2019