పంటల సాగుకు మరింత ఊతమిస్తూ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం నెలకొంది. దక్షిణ ద్వీపకల్ప భారత్ మీదుగా షియర్ జోన్ కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
ఉత్తర కోస్తాంధ్రకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. తీరం వెంట బలమైన గాలులు గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయని.. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు మూడు రోజులపాటు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది.
భారీ వర్ష సూచనతో తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
నిర్మల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయిందని అధికారులు చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది. భారీ వర్ష సూచనతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీరంలో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు వర్షాలతో ఎల్లో అలర్ట్ అయింది..
దక్షిణ కోస్తాలో నేడు తేలికపాటి జల్లులు పడతాయి. కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 10 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Bay of Bengal, IMD, Imd hyderabad, Rain alert, Telangana, Weather report