Rain Alert: తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్షసూచన.. బీ అలర్ట్

ప్రతీకాత్మక చిత్రం

వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

  • Share this:
    గత 10 రోజులుగా కురుస్తున్న వానలతో తెలంగాణ తడిసి ముద్దవుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. ఐతే మరికొన్ని రోజులు ఈ వాన కష్టాలు తప్పేలా లేదు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వివరాల ప్రకారం... ఉత్తర ఒడిశా, జార్ఖండ్‌ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంతో పాటు దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈ నెల 23న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది.

    ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండిపోయింది. ఈ క్రమంలోనే 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఏకంగా 10 గేట్లు తెరవడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. అక్కడి నాగార్జున సాగర్‌కు పరుగులు పెడుతోంది. ఇన్‌ఫ్లో పెరగడంతో నాగార్జున సాగర్ డ్యామ్‌ కూడా నిండిపోయింది. ఇవాళ ఉదయం సాగర్ డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. నాగార్జున సాగర్ గేట్లను తెరుస్తున్న నేపథ్యంలో డ్యామ్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కరోనా విజృంభిస్తున్న కారణంగా డ్యామ్ వద్దకు పర్యాటకులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published: