కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదని.. ఈ నేపథ్యంలో జాతీయ హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి (MP Uttam Kumar) అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ వ్యాఖ్యలు చేసింది.
'' కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) 2016, 2018లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. అనుమతులుంటే కాళేశ్వరాన్ని హైపవర్ స్టీరింగ్ కమిటీ పరిశీలించాలి. హైపవర్ కమిటీ అనుమతిస్తేనే జాతీయ హోదా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు కాళేశ్వరానికి ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ లేదు. జాతీయ ప్రాజెక్టుల జాబితాలో చేర్చే అర్హత దానికి లేదు. '' అని కేంద్రజలశక్తిశాఖ సహాయకమంత్రి బిశ్వేశ్వర్ తుడు పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విషయం తెలిసిందే. గోదావరి నది (Godavari River)ని ఎత్తిపోసి.. లక్షల ఎకరాలకు నీరు ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు ఎక్కడా లేదని ఎన్నో సందర్భాల్లో తెలిపింది. ఐతే అదే కాళేశ్వర ప్రాజెక్టులు కొన్ని రోజులుగా తెలంగాణలో హాట్ టాపిక్‌గా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టులోని పలు పంప్‌హౌస్‌లు నీట మునిగాయి. తప్పుడు డిజైన్ల వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. వరదలో మునిగిపోయిన పంపులను బాగు చేయాలంటే వందల కోట్ల ఖర్చవుతుందని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇరిగేషన్ చీఫ్ రజత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిలో మునిగిన పంప్ హౌజ్ మరమ్మత్తుల ఖర్చులు రూ.300 కోట్ల మేర ఖర్చు అవుతుందని విపక్షాలు చేస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన అన్నారు. పంప్ హౌజ్‌ల మరమ్ముతలకు అయ్యే ఖర్చు రూ.20 కోట్లకు మించదని స్పష్టం చేశారు. ఆ భారం ప్రభుత్వంపై పడబోదని.. మరమ్మతు ఖర్చు కూడా ప్రాజెక్టు కట్టిన కాంట్రాక్టర్లే భరిస్తారని స్పష్టం చేశారు. బురదలో కూరుకుపోయిన పంప్‌హౌజ్‌లను మరమ్మతు చేసి సెప్టెంబర్ లోపు మళ్లీ నడిపస్తామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా ప్రాజెక్టును నిర్మించానడంతో నిజం లేదన్నారు రజత్ కుమార్. కేంద్ర పరిధిలోని 18 సంస్థలు అనుమతి ఇచ్చిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని కట్టారని స్పష్టంచేశారు. కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు పడడం వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేశామని.. అందుకే అంత పెద్ద వరదలు వచ్చినా.. తట్టుకొని నిలబడిందని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Kaleshwaram project, Telangana