Telangana Waterfalls: ఆదిలాబాద్‌లో మంత్రముగ్ధులను చేస్తున్న జలపాతాలు

తెలంగాణలో జలపాతాలు కళకళ

Waterfalls in Telangana | ఎంతో ప్రాచుర్యం పొందిన కుంటాల, పొచ్చెర జలపాతాలతోపాటు మారుమూల గ్రామాల్లోని చిన్నచిన్న జలపాతాలు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి.

  • Share this:
    Kuntala Water Falls | సుందర జలపాతాలకు ఆలవాలమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలకళను సంతరించుకొని పరవళ్ళు తొక్కుతున్నాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన కుంటాల, పొచ్చెర జలపాతాలతోపాటు మారుమూల గ్రామాల్లోని చిన్నచిన్న జలపాతాలు కూడా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. అయితే కరోనా నేపథ్యంలో ప్రముఖ జలపాతాల వద్ద కట్టడి చేస్తుండటంతో పర్యాటకులు మారుమూల జలపాతాల వైపు బాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా అనగానే అందరికి ముందుగా గుర్తుకువచ్చేది నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం. ఆ తర్వాత బోథ్ మండలంలోని పొచ్చెర జలపాతం. ఇవే కాకుండా మూరుమూల ప్రాంతాల్లో కూడా సహజ సిద్దంగా వెలసిన ఎన్నో జలపాతాలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. గాయత్రి, కనకాయి జలపాతాలు కూడా నీటితో నిండి ఉరకలు వేస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో గిరిజన ప్రాంతంలో ఉన్న ఖండాల జలపాతం వద్ద కనిపించే దృశ్యాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి తరలివస్తున్నారు. వన భోజనాలు కూడా చేసుకుంటున్నారు.

    ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని కోకస్ మన్నూరు గ్రామ శివారులో సహజ సిద్దంగా ఏర్పడిన పెద్ద గుండం జలపాతం కూడా వర్షాలతో మరిన్ని సొబగులను అద్దుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇచ్చోడ మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పెద్దగుండం జలపాతం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకుతూ సవ్వడి చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం నాగల్ కొండ గ్రామంలోని పారాఖప్పి జలపాతం, అటు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలోని మిట్టె జలపాతం, తిర్యాణి మండలం చింతల మాదారం జలపాతం పాలనురగల పరవళ్ళు తొక్కుతున్నాయి. కొండకోనల మధ్య సహజ సిద్దంగా వెలసిన ఈ జలపాతాల వద్దకు వెళ్ళేందుకు సౌకర్యాలను మెరుగుపరిస్తే రానున్న రోజుల్లో ఈ జలపాతాలు కూడా మరింత ప్రాచుర్యం పొందే అవకాశాలు లేకపోలేదు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: