Santosh, News18, Warangal
వరంగల్ (Warangal) మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చెత్త పేపర్లు ఏరుకునే ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని వరంగల్ (Warangal) సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి సుమారు రెండు లక్షల విలువగల జనరేటర్ రేడియేటర్, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వరంగల్ ఏసిపి గిరికుమార్ నిందితుల వివరాలు వెల్లడించారు. మడికొండ ప్రాంతానికి చెందిన మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ దివ్య, రామక్క, నూనె ఎల్లయ్య అలియాస్ గజ్జి ఎల్లయ్య బంధువులు. వీరు చెత్త కాగితాలు, పాత ఇనుప సామాగ్రి సేకరిస్తూ జీవించేవారు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు నిందితులు మట్టవాడలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ప్రముఖ కంపెనీకి చెందిన వర్క్ షాప్ కాంపౌండ్ లో ఉన్న జనరేటర్ చోరీ చేసి అమ్మి సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు.
ముగ్గురు నిందితులు ఆటో డ్రైవర్ సహకారంతో ఈనెల 13 తేదీన తెల్లవారుజామున జనరేటర్ రేడియేటర్ చోరీ చేశారు. వరంగల్ నాయుడు పెట్రోల్ పంపు వెనుక చెట్టుపదల్లో రేడియేటర్ను రహస్యంగా ఉంచారు. ఈ చోరీపై కంపెనీ యజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కదలికలపై పోలీసులు నిఘాపెట్టారు.
నలుగురు నిందితులు రేడియేటర్ అమ్మేందుకు ఆటోనగర్ కు వస్తున్నట్లుగా సమాచారం రావడంతో పట్టుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించారు. అలేటి మైసమ్మ, దివ్య గతంలో ఆత్మకూరు మట్టవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడి పోలీసులకు చిక్కారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మదనపు డీసీపీ పుష్ప , ఏసీపీలను, అధికారులను, సిబ్బందిని కమిషనర్ రంగనాథ్ అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal