బాల భీముడు భలే ముద్దొస్తున్నాడే -5కేజీల బరువుతో శిశువు జననం -వరంగల్ జిల్లాలో మరో అద్భుతం

వరంగల్ జిల్లాలో బాల భీముడు

సాధారణంగా రెండున్నర నుంచి నాలుగు కిలోల బరువుతో పుట్టే శిశువుల్ని ఆరోగ్యవంతులుగా భావిస్తారు. అయితే, అరుదుగా మాత్రమే నిండైన ఆరోగ్యంతో ఐదు కేజీల బరువుతో శిశువులు పుడుతుంటారని, దీన్ని చిన్నపాటి అద్భుతంగానూ భావించొచ్చని డాక్టర్లు చెబుతుంటారు. ఇదిగో, ఈ ఫొటోలోని నవజాత శిశువూ అలాంటి రకమే. ఇంకా పేరు పెట్టని వీడిని ఇప్పటికైతే ముద్దుగా బాల భీముడని పిలుస్తున్నారు..

  • Share this:
వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో ఐదు కేజీల బరువుతో ఓ బాబు జన్మించాడు. ఇలాంటి జననాలు అరుదు కావడంతో వాడి ఫొటోలిప్పుడు జిల్లాలో వైరల్ అయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాలకు చెందిన పరశురాం ఎలక్ట్రిషన్. అతనికి ఏడాది కిందట స్పందనతో వివాహమైంది. నెలలు నిండిన స్పందన ప్రసవం కోసం వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో చేరింది..

డాక్టర్ మానసా రెడ్డి, డాకర్ నరసింహ స్వామి, డాక్టర్ తిరుపతి రెడ్డి, నర్సులు దివ్య, సునంద, భాస్కర్ లతో కూడిన వైద్య బృందం బుధవారం స్పందనకు ఆపరేషన్ నిర్వహించి శిశువును బయటికి తీశారు. వాడి బరువు ఐదు కేజీలు ఉండటం, ఇది అరుదైన కేసు కావడంతో ఆస్పత్రిలో సందడి నెలకొంది. బాలింతకు కేసీఆర్ కిట్ అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి..

బాల భీముడితో వర్ధన్నపేట వైద్య సిబ్బంది


ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ప్రతి వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయని డాక్టర్లు చెబుతున్నారు. విచిత్రంగా ఇదే వర్ధన్నపేట ప్రభుత్వాసుపత్రిలో గత మే నెలలో ఐదు కేజీల బరువుతో ఆడ శిశువు జన్మించింది. అప్పుడు కూడా ఇదే వైద్య బృందం చేతుల మీదుగా పురుడుపోశారు. రెండు నుంచి నాలుగు కిలోలలోపు సాధారణ జననాలు జరుగుతాయని, వెయ్యి మందిలో ఒకరికి ఇలా అధిక బరువుతో పిల్లలు జన్మిస్తారని డాక్టర్లు చెబుతున్నారు
Published by:Madhu Kota
First published: