(Pranay Diddi, News 18, Warangal)
కరోనా మహమ్మారి మనందరి జీవితాలను ఏ విధంగా చిన్నాభిన్నం చేసిందో చూస్తూనే ఉన్నాం. ప్రపంచంపై పెను ఉపద్రవంలా విరుచుకుపడ్డ మహమ్మారి మనుషుల జీవితాలను తలకిందులు చేసింది. ఎంతో మందిని ఎన్నో విధాలుగా కోవిడ్(Covid) ప్రభావితం చేసింది. మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్(Lockdown) ప్రజలను మరింత నిరాశానిస్పృహలోకి నెట్టింది. గడిచిన మూడేళ్ళుగా కోవిడ్..దాని తాలూకు పరిణామాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఇక పేద వారు, యాచకుల దుస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక్క పూట అన్నం దొరక్క, ఆకలితో అలమటిస్తూ.. ఎవరైనా కరుణిస్తారా అని చూసిన వారెందరో. సాటి మనిషి గురించి ఆలోచించే స్థితిలో కూడా లేరు. దీంతో లాక్‌డౌన్ సమయంలో యాచకులు, రోడ్డు ప్రక్కన నివసించే వారు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు. అటువంటి వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చింది విజ్డం ఛారిటబుల్ ట్రస్ట్(Wisdom Charitable Trust).
చేతిలో చిల్లిగవ్వ లేదు, అయినా ఆపన్న హస్తం:
2020 మార్చి నెలలో విధించిన లాక్‌డౌన్ సమయంలో వరంగల్ జిల్లా పరిధిలో ఎంతో మంది నిరుపేదలు, దినసరి కూలీలు, యాచకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూట గడవక, పస్తులుంటూ, ఆకలితో బిక్కుబిక్కుమంటూ సాయం కోసం ఎదురు చూశారు. వీరి దుస్థితికి చలించిపోయిన అనుమాండ్ల నాగరాజు, ఎలాగైనా వారికి సహాయం చేయాలనీ తలపించాడు. లాక్‌డౌన్ కావడంతో బయటకు వెళ్లలేని సమయంలో ఫోన్ ద్వారానే తన తోటి మిత్రులకు విషయం చెప్పి..పేదలకు అన్నదానం చేయాలనీ సంకల్పించారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పమే వారిని ముందుకు నడిపించేలా చేసింది. నాగరాజుకు తోడు మరో ముగ్గురు సైతం మేమున్నామంటూ ముందుకు వచ్చి..తమకు తోచినంత సహాయం చేసి అన్నదానం ఏర్పాట్లు చేశారు. అలా ఆ నలుగురు ఎనిమిదిగా మారి ఒక్క అడుగు ముందుకు వేశారు. తామే స్వయంగా భోజనాలు తయారు చేసి వరంగల్, హన్మకొండ పరిధిలోని రైల్వే స్టేషన్, బస్ స్టాప్, ట్రాఫిక్ సిగ్నల్..ఇలా ఎక్కడ ఆకలి ఉంటే అక్కడికి వెళ్లి ఆహార పొట్లాలు అందించారు.
ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన:
సాటి మనిషికి సహాయం చేయాలనే ఆలోచన మొదటి నుంచి ఉన్నప్పటికీ..నాగరాజు మరికొందరు మాత్రమే తమ వంతు సహాయం చేస్తుండేవారు. ఈక్రమంలో లాక్‌డౌన్ సమయంలో తనతో పాటు మరో ఎనిమిది మంది తోడుగా నిలవడంతో అందరూ కలిసి ఒక ట్రస్ట్‌గా ఏర్పడి..ట్రస్ట్ ద్వారానే కార్యక్రమాలు నిర్వహించారు. గత కొంత కాలం నుంచి ఎంతో మంది ఆకలి తీరుస్తున్న వీరికంటూ ఒక సంస్థ ఉండాలని 2021 డిసెంబర్ 21న 'విజ్డం చారిటబుల్ ట్రస్ట్ (Wisdom Charitable Trust)'ను స్థాపించి నాటి నుంచి నేటి వరకు తమ సహాయసహకారాలను కొనసాగిస్తున్నారు. ఎవరి సహాయసహకారాలు అందినా అందకపోయినా వారానికి రెండు రోజులు వీలైతే మూడు రోజులు సొంత ఖర్చుతో అన్నదానం చేస్తూ నిరుపేదల ఆకలి తీరుస్తున్నారు.
ట్రస్ట్ నిర్వహణ కోసం మన వంతు:
ఇంతవరకు విజ్డం ట్రస్ట్ ద్వారా ఈ యువకులు తమ సొంత ఖర్చుతోనే సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే దాతలు ఎవరైనా ముందుకు వస్తే..మరింత మంది పేదలకు సహాయం చేయవచ్చని ఆశిస్తున్నారు. వీలైతే మన వంతుగా మనం సహకరిద్దాం. చేయి చేయి కలుపుదాం చేయూతనిద్దాం ఒక్క అడుగు సమాజంలో మార్పు ఆ మార్పు కోసం ప్రయత్నిద్దాం. నిరుపేద గుండెల్లో దివ్య జ్యోతుల అవుతాం మన వంతుగా మనం సహకరిద్దాం మన మానవత్వాన్ని మనం నిలుపుకుందాం. విజ్డం ఛారిటబుల్ ట్రస్ట్ హన్మకొండలో ఉంది. అనుమాండ్ల నాగరాజు ఫౌండర్ గానూ, యాకూబ్ కో- ఫౌండర్ గానూ వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్ నిర్వాహకుల ఫోన్ నెంబర్ +91 7780264089.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Warangal