వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల పేర్లను మార్చుతున్నట్టు ముఖ్యంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరంగల్‌లో నూతనంగా నిర్మించిన వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికుల విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్ జిల్లా పేరును హన్మకొండ జిల్లాగా మార్చుతామని వెల్లడించారు. నేడు ప్రారంభించిన కలెక్టరేట్ భవనాన్ని హన్మకొండ జిల్లాగా పరిగణించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా పేరును వరంగల్‌గా మారుస్తామని అన్నారు. ఇకపై హన్మకొండ, వరంగల్ జిల్లాలు ఉంటాయన్నారు. వరంగల్ కలెక్టరేట్‌ను త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు.
జిల్లా పేరు మార్పుకు సంబంధించిన ఉత్తర్వులు రెండు, మూడు రోజుల్లో వస్తాయని సీఎం కేసీఆర్ తెలిపారు. అధునాతన జిల్లా కలెక్టరేట్ భనవాన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. వరంగల్‌కు వెటర్నిటీ కాలేజ్ మంజూరు చేశామని సీఎం చెప్పారు. హైదరాబాద్ కంటే వరంగల్ ఏ మాత్రం తక్కువ కాదన్నారు. వరంగల్ నగరం హెల్త్ హబ్ మారాలని అన్నారు.
ఇక, వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్.. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం పలికారు. వరంగల్ పర్యటనలో భాగంగా నగరంలో ఏర్పాటు చేసిన కాళోజీ నారాయణరావు ఆరోగ్య, విజ్ఞాన విశ్వవిద్యాలయ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసిన కాళోజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్.. పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే వరంగల్‌లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.