Santosh, News18, Warangal
దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని డంపింగ్ యార్డ్ గా వినియోగిస్తున్నారు. వరంగల్ (Warangal) నగరంలో ఎక్కడ చెత్త సేకరించినా ఇక్కడికే చేరవేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో ఈ డంపింగ్ యార్డ్ నగరవాసులకు సవాల్ విసురుతోంది. ఉన్నట్టుండి డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడం, సమీపంలోని ఇండ్లలోకి పొగ చేరుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ కేంద్రంలోని పోతన నగర్ లో ఏర్పాటుచేసిన ఈ డంపింగ్ యార్డ్ కాలుష్యాన్ని పెంచుతున్నప్పటికీ పట్టించుకునే వారే లేకుండా పోయారు అన్నది వాస్తవం. నగరంలో సుమారు 3.5 లక్షల నుండి 5 లక్షల వరకు జనాభా ఉంది. నగర వాసులు పడేస్తున్న చెత్త అంతా వచ్చి ఇక్కడే చేరుతూ ఉంటుంది. సుమారు 140 మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డ్ లో పడేస్తుంటారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన చెత్త గుట్టలను మరిపిస్తుందంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పట్లో ఏర్పాటు చేసిన ఈ డంపింగ్ యార్డును నేటికీ అలాగే కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు సుమారు మూడు లక్షల వరకు జనాభా ఉన్నప్పుడు ఏర్పాటైన ఈ డంపింగ్ యార్డ్ ఇప్పుడు 5 లక్షల జనాభా వరకు చేరినప్పటికీ ఇలాగే కొనసాగిస్తున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరో చోట డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయడం కానీ.. ప్రత్యామ్నాయంగా మరిన్ని చోట్ల యార్డులను ఏర్పాటు చేయడం కానీ లేదు.
గతంలో ఒకసారి ఇక్కడ డంపింగ్ యార్డ్ ను మార్చాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆచరణలో మాత్రం పెట్టలేదు. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ డంపింగ్ యార్డ్ సమీపంలోని నివాసితులకు పరీక్ష పెడుతుందనే చెప్పాలి. చెత్తలో రాజుకున్న నిప్పుతో పొగరావడం.. అదికాస్తా సమీపంలోని ఇళ్లలోకి చొరబడడంతో ఆయా ప్రాంతాల వాసులు కాలుష్యం కొరలో చిక్కుకుంటున్నారు.
నగరంలో ఉన్న వ్యర్థపదార్థాలు మొత్తాన్ని తీసుకువచ్చి ఇక్కడ వేయడంతో దుర్గంధమైన వాసనకు ఇక్కడ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఏర్పడేటువంటి అగ్ని ప్రమాదాలకు దానితో వచ్చే పొగ స్థానికులు పీల్చడం ద్వారా అనేక రకమైన వ్యాధుల బారిన పడి అనారోగ్య పాలవుతున్నామని స్థానికులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని ఈ డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి మరొక చోటకు తరలించే ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal