Santhosh, News 18, Warangal
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి నగరం.. రాష్ట్ర రెండవ రాజధానిగా పిలవబడే నగరం వరంగల్ . ఇంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక చారిత్రాత్మ నగరానికి ఓ సమస్య వెంటాడుతుంది. భాగ్యనగరం తర్వాత స్మార్ట్ సిటీగా పిలవబడే వరంగల్ నగరం పాలక సంస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక సమస్యల నిలయంగా మారిపోయింది. నగర జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రెండు దశాబ్దాల కాలంగా డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తి కావడం లేదు.
ఎన్నో పథకాలకు అవార్డులు పొందినప్పటికీ స్మార్ట్ సిటీ పనుల్లో ఎక్కడికక్కడే ఆగిపోవడం శోచనీయం.తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద నగరంగా గుర్తింపు సాధించింది వరంగల్. చారిత్రాత్మక చరిత్ర కలిగిన ఈ నగరపాల సంస్థకు గ్రేటర్ హోదా కూడా కల్పించారు. అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ట్రై సిటిస్ కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బలహీనంగా ఉన్నాయి.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేక చిన్న వర్షానికి కాలనీలు మునిగిపోతున్నాయి.డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోతుంది. ఈ విషయంపై అధికారులు ప్రయత్నిస్తున్నట్టుగా మాత్రం అనిపించడం లేదు.
వరంగల్ ఆ నగరపాలక సంస్థ ఇటీవల పలు కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎంపికయింది. స్మార్ట్ సిటీతో పాటు మరిన్ని పథకాలతో చారిత్రాత్మక నగరాన్ని ఎంపిక చేశారు. దీనికిగాను 1500 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధమయ్యాయి. కాలనీలలో ఉన్న మురికి నీరంతా శివారు ప్రాంతంలో ఉన్న చెరువులో కలుస్తున్నాయి. చెరువు వర్షపునీటిని నగరం బయటకు తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15.50కోట్లతో శివనగర్ కాలనీలో డ్రైనేజీ బాక్స్ నిర్మాణాన్ని చేపట్టింది. ఈప్రాజెక్టును టెండర్ ద్వారా ఓ కంపెనీ దక్కించుకుంది. టెండర్ నియమావళి ప్రకారం టెండర్ పొందిన నాటి నుంచి ఏడాదిలోపు పనులు పూర్తి చేయాలి. అయితే ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదు. సగం పనులు పూర్తి చేసి ఎక్కడి పనులను అక్కడే నిలిపివేసింది.
శివనగర్ నుంచి మైసయ్య నగర్ వరకు అండర్ గ్రౌండ్ డైనేజీ మరియు సీసీ రోడ్ల విస్తరణ పనుల నిమిత్తం టెండర్ ద్వారా రూ.26 కోట్ల పనులను అప్పగించారు. మొత్తం రూ.41కోట్ల పనులను చేజిక్కించుకున్న సదరు సంస్థ ఇప్పటి వరకు సగం పనులను కూడా పూర్తి చేయలేదు. పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. పనిచేయని సంస్థకు మళ్లీ పనులు కేటాయించకుండా చూడాల్సిన అధికారులు అన్ని రకాలుగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చింతల్ ఫ్లైఓవర్ నుంచి అగర్తల చెరువు మీదుగా పడెమరకోట చమన్ వరకు బీటీ రోడ్డు, చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి రూ.2.5కోట్లు టెండర్ ద్వారా సాంక్షన్ చేసి వర్క్ ఆర్జర్ ఇచ్చారు. టెండర్ నియమావళి ప్రకారం ఈ పనులను కేవలం ఆరు నెలల కాల పరిమితి లోపు పూర్తి చేయాలి.
కానీ నేటికీ కొలతల దశలోనే బీటీ రోడ్డు పనులు ఉన్నాయి. చెరువు చుట్టూ నాసిరకం కాంక్రీట్ తో చిన్నపాటి వాల్ నిర్మించారు. కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా అభివృద్ధి పనులు సమయానికి పూర్తిచేయకున్నా మున్సిపల్‌శాఖ ఇంజినీరింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం వారి పనితీరుకు నిర్ల్యక్షం కనిపిస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మున్సిపల్ శాఖ కమిషనర్ నాణ్యతతో కూడిన పనులను నిర్జీత గడువులో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని వరంగల్ వాసులు, బీజేపీ నాయకులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal