రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్న శంకర్, విజయ దంపతులకు కూతురు నవ్య,కుమారుడు అమృత్ ఉన్నారు. కుమారుడు అమృత్ స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లి నవ్య వరంగల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆరోగ్య సమస్యతో చికిత్స పొందుతుండగా.. తండ్రి శంకర్ పాఠశాలకు ఆలస్యమవుతుందని కుమారుడిని మందలించి పనికి వెళ్ళాడు. తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన బాలుడు ఇంట్లో తల్లి చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటన వీరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుబేదారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలానికి చెందిన ఓ విద్యార్థి గత ఐదు ఏళ్ళుగా పాఠశాల వసతి గృహంలో ఉంటున్నాడు. ఉదయం స్నానాల గదిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన వార్డెన్ వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. గతంలో పలుసార్లు కడుపునొప్పితో బాధపడుతూ ఉండేవాడని వసతిగృహం వార్డెన్ తల్లిదండ్రులకు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేయబడుతున్నట్టు సిఐ పేర్కొన్నారు.
ఇప్పటి రోజుల్లో చాలామంది పిల్లలు మానసికంగా బలహీనంగా మారిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి కూడా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్లకు బానిసలైపోతున్న పిల్లలు.. వాటికి అతుక్కుపోతూ తెలియని మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని మానసిక వైద్యుడు డాక్టర్ పివి కమల కిషోర్ పేర్కొన్నారు. సెల్ ఫోన్ల ప్రభావంతో పిల్లల ఆలోచనశక్తి బాగా తగ్గిపోతుందని.. చాలావరకు పిల్లలను వాటికి దూరంగా ఉంచాలని చెప్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ఇస్తే తల్లిదండ్రులు పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు. పిల్లలు హృదయాలు సున్నితంగా ఉంటాయని.. సెల్ ఫోన్ కు ఆకర్షితులై.. అందులో కనిపించేదే లోకంగా.. అందులో వచ్చే సందేశాలని వ్యక్తిగతంగా తీసుకుంటారని.. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal