గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. అయితే నామినేషన్లు వేస్తున్న ఆశావాహుల్లో మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠకు తెరలేసింది ..దీంతో ఎలాంటీ సందిగ్ధత లేకుండా టీఆర్ఎస్ వ్యవహంచినట్టు తెలుస్తోంది..ఈ నేపథ్యంలోనే వరంగల్ మేయర్ పీఠంపై అధికార పార్టీ సంకేతాలు పంపినట్టు సమాచారం. దీంతో మాజీ మహిళ ఎంపీకి ఆ సంకేతాలు వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమె నామినేషన్ వేసేందుకు సన్నద్దమవుతుందని సమాచారం .
వరంగల్ మేయర్ పీఠంపై అధిష్టానం స్పష్టత ?
వరంగల్ కార్పోరేషన్ మేయర్ పీఠం ఉత్కంఠకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం , నామినేషన్ల పర్వానికి ముందే తెరదించింది. దీంతో వరంగల్ మేయర్ ఎవరనేది ముందే పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్ర్ర వ్యాప్తంగా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేయర్ పదవిని ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసిఆర్ అలోచనగా చెబుతున్నారు. దీంతో ఇప్పటివరకు వివాదరహితంగా ఉన్న మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణిని మేయర్ పీఠంపై కూర్చేబెట్టేందుకు పార్టీ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం.
సామాజిక వర్గాలకు ప్రాధాన్యత
ముఖ్యంగా గుండు సుధారాణిది బీసీ , పద్మశాలీ సామాజిక వర్గం. వరంగల్ నగరంలో మున్నూరు కాపుల తర్వాత పద్మశాలీల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు రాష్ట్ర్ర వ్యాప్తంగా కూడ పద్మశాలీలకు రాజకీయ ప్రాధాన్యత దక్కలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో గుండు సుధారాణి వైపు పార్టీ అధిష్టానం మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. మరోవైపు వరంగల్ అర్భన్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వారికి మరోసారి అవకాశం దక్కే అవకాశాలు మాత్రం కనిపించడం లేదన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ..
మేయర్ కోసం మంత్రి కేటీఆర్ సన్నిహితులు
కాగా మేయర్ పీఠం కోసం గత కొద్ది కాలం నుండి మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న నేతలు ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర్ర రుణ విముక్తి కమీషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు ఇప్పటికే మేయర్ పీఠం కోసం కసరత్తు చేశారు. ఇందుకోసం ఆయన వరంగల్‌లో మాకం వేసి జిల్లా నేతలతో సంప్రదింపులు కూడ జరిపారు. మరోవైపు ఈయన కోసం ఓ సిట్టింగ్ కార్పోరేటర్ కూడ తన స్థానాన్ని వదులుకునేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా అధిష్టానం కూడ ఆయన వైపే సానుకూలంగా ఉన్నట్టు సంకేతాలు ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో నాగుర్లకు మొండి చేయి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
మున్నూరు కాపులకు కేటాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు
ఇక మున్నూరు కాపులకు ప్రాధాన్యత ఇస్తారనే కోణంలో కూడ స్థానిక నేతలు మేయర్ పీఠం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ సోదరుని తోపాటు ఇటివలే పార్టీలో చేరిన మున్నూరు సామాజిక వర్గానికి చెందిన వ్యాపారవేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు తోపాటు పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ,తెలంగాణ ఉద్యమం నుండి కొనసాగుతున్న గుండేటి నరేందర్ కూడ సిరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నేడు గుండు సుధారాణి నామినేషన్ వేస్తే... మేయర్ పదవిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Municipal Elections, Warangal