Santosh, News18, Warangal
జనగాం జిల్లా (Janagan district) కేంద్రం సమీపంలోని పెంబర్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టైర్ పంచర్ అయి రోడ్డు పక్కన ఆపి ఉన్న డీసీఎం వాహనాన్ని కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు మృతి మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి ఉంది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ కొండాపూర్ కు చెందిన మిర్యాల దేవేందర్ రెడ్డి, శ్రావణి, వారి కూతురు శ్రీహిత కారులో కాజీపేటకు వెళ్లి అక్కడి నుండి ట్రైన్ లో తిరుపతికి వెళ్లారు. తిరిగి కాజీపేట నుంచి కారులో హైదరాబాదుకు బయలుదేరారు. ఈ క్రమంలో జనగామ జిల్లా కేంద్రం శివారు ప్రాంతమైన పెంబర్తి వద్ద ఓ డీసీఎం వాహనం పంచర్ కావడంతో రోడ్డు పక్కన వాహనాన్ని ఆపి టైరు మారుస్తున్నారు. వెనుక వైపు నుండి వస్తున్న కారు అతివేగంగా వచ్చి టైరు మారుస్తున్న డ్రైవర్ అబ్దుల్ రహీమ్ ను, పంచర్ షాప్ ఓనర్ కటారి శేఖర్ ను ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కారు ఢీ కొన్న సమయంలో డోర్ ఓపెన్ కావడంతో చిన్నారి శ్రీహిత కింద పడిపోయింది. తీవ్ర గాయాలయి ఆమె కూడా చనిపోయింది. కారులో గాయాలయిన దేవేందర్ రెడ్డి దంపతులను స్థానికుల సహాయంతో జనగామ ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాదుకు తరలించారు. జనగామ సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఒక్క ప్రమాదంతో మూడు కుటుంబాల్లో అంతులేని విషాదఛాయలు నెలకొన్నాయి. సందర్భంగా జనగామ సీఐ మాట్లాడుతూ.. వాహన చోదకులు రహదారిపై ఏదైనా సమస్య ఏర్పడితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని.. రోడ్డు దాటేటప్పుడు కూడా ఇరువైపులా చూసుకొని దాటాలన్నారు. అతివేగంగా వెళ్లడం వలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయని కాబట్టి అధిక వేగం పనికిరాదని వాహనదారులకు మీడియా ద్వారా సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Road accident, Telangana, Warangal