Santosh, News18, Warangal
ఎత్తయిన కొండల నడుమ ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్న ప్రదేశంలో కొలువై ఉంటుంది సిద్దేశ్వర ఆలయం. హనుమకొండలోని ఈ సిద్దేశ్వర ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది. భాద్రపద మాసంలో వినాయక నవరాత్రుల సమయంలో సూర్య భగవానుడు నేరుగా స్వయంభు లింగాన్నితాకుతాడు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా ఉత్తర ముఖాన వెలసిన స్వామిని సాయం సంధ్యావేళ మాత్రమే సూర్యభగవానుడు దర్శించుకుని వెళ్తాడు. ఏడాదికి ఒక్కసారి ఆవిష్కృతం అవుతున్న ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తుంటారు.
చారిత్రక ఓరుగల్లు (Warangal) లో అడుగుపెట్టిన వారికి అడుగడుగునా దైవ క్షేత్రాలే దర్శనమిస్తాయి. వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటితో పాటు ప్రకృతి రమణీయతల మధ్య అత్యద్భుత నిర్మాణ కౌశలంతో అలరాలుతున్న హనుమకొండలోని మరొక సయ్వాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పద్మక్షమ్మ గుట్టకు ఎదురుగా ఉన్న నల్లటి రాతిగుట్టలో వెలసిన సిద్దేశ్వరాలయం ఏడాదికొకసారి అద్భుత ఘట్టానికి వేదికవుతోంది. మామూలు రోజుల్లో శివుడి చెంతకు సూర్యకిరణాలు వెళ్ళవు. ఏడాదికి మూడు రోజులు మాత్రం నేరుగా ఆ శివలింగంపై సూర్యకిరణాలు శ్మృషిస్తాయి. ప్రకృతి రమణీయతతో కొండల మధ్య నుంచి వచ్చే ఆ కిరణాలు అందరినీ పులకింపజేస్తాయి.
అన్ని దేవాలయాలతో పోలిస్తే సిద్దేశ్వరాలయ నిర్మాణం ఎంతో వైవిధ్యత కూడుకుంది. ఇక్కడ ఉన్న స్వయంభు లింగం ఉత్తర ముఖాన ఉంటుంది. దేవాలయం చుట్టూ ఉన్న ఎత్తైన కొండల పక్కన చిన్నపాటి కోనేరు ఆసక్తి నెలకొల్పుతుంది. ప్రతి ఏటా భాద్రపదం వినాయక నవరాత్రుల్లో పద్మాక్షమ్మ గుట్ట నుంచి ఎదురుగా ఉన్న నంది విగ్రహాన్ని దాటుకొని నేరుగా గర్భగుడిలో ఉన్న శివలింగంపై సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.
ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో ఆవిష్కృతమయ్యే ఈ అద్భుతం కేవలం 3 నుంచి 5 నిమిషాల పాటు కనిపించడం ఎంతో విశేషమని ఆలయ అర్చకుడు చెబుతున్నారు. సిద్దేశ్వరాలయంలో మరో ప్రత్యేకత ఏంటంటే గత 18 తరాలుగా సిద్దేశ్వర వంశీకులే ఈ ఆలయంలో అర్చకులుగా ఉండడం విశేషం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindu Temples, Local News, Telangana, Warangal