Santosh, News18, Warangal
పుట్టుకతో అతని జీవితంలో కారు చీకట్లు కమ్మేశాయి. తోటి వారితో కలిసి ఆటపాటలు లేవు. ఉన్నదంతా గుండెల నుండి ఆత్మ విశ్వాసం. అదే ఆత్మవిశ్వాసంతో తన అంధత్వాన్ని జయించి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అతని సంకల్పానికి విధి కూడా తలవంచింది. తన వైకల్యాన్ని ఎన్నడూ ఎత్తి చూపని కుటుంబ సభ్యులు, తన మనసుని అర్ధం చేసుకున్న భార్య, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషమైన జీవితం గడుపుతున్నాడు ఆ వ్యక్తి. తాను కళ్లతో ప్రపంచాన్ని చూడలేకపోయినా మనసుతో చూస్తున్నాడు. అతనే వరంగల్ జిల్లా (Warangal District) లింగాపూర్ గ్రామానికి చెందిన దశరథం. దశరథం పుట్టుకతోనే అంధుడు. వైకల్యం కారణంగా బాల్యాన్ని, యవ్వనాన్ని కోల్పోయాడు.
అయితేనేం ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న దశరథం హైదరాబాద్ (Hyderabad) లోని ఓ బ్లైండ్ స్కూల్లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. కళ్లు లేకపోయినా మిగతా విషయాల్లో చురుగ్గా ఉండే దశరథం 1995లో వన సంరక్షణ శాఖలో అటెండర్ గా ఉద్యోగాన్ని పొందాడు. అనంతరం 1997లో లతతో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ప్రస్తుతం హనుమకొండలోని రెవెన్యూ కాలనీలో కుటుంబం మొత్తం నివాసముంటుంది.
27 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్న దశరథం ప్రతిరోజు తాను ఆఫీసుకు వెళ్లడానికి తన భార్య సహాయం తీసుకుంటాడు. కానీ ఆఫీసులో మాత్రం తన పని తానే చేసుకుంటాడు. తాను ఎన్నడూ కూడా కళ్ళు లేవన్న భావనతో లేనని తనకున్న మనోధైర్యంతోనే అన్ని పనులు సక్రమంగా చేసుకుంటున్నానని దశరథం తెలిపాడు.
వివాహం జరిగి సుమారు 25 ఏళ్లు గడిచినా తమ దాంపత్య జీవితంలో ఎలాంటి విభేదాలు లేవని దశరథం భార్య లత తెలిపింది. కళ్లు లేకపోయినా ఏనాడూ తమను కష్టపెట్టకుండా భర్త దశరథం తమను ప్రేమగా చూసుకుంటున్నాడని వివరించింది. ఆయనకు కళ్లు లేవని తామెన్నడు బాధ పడలేదని ఆత్మవిశ్వాసంతో అన్ని పనులను చేసుకునే ఆయన్ను చూసి గర్వంగా ఉంటుందని లత తెలిపింది.
మా నాన్న అంధుడైన తమ కోసం చాలా కష్టపడతాడని, ఆయన కూతురిగా మంచి ప్రయోజకురాలినై అమ్మానాన్నలను బాగా చూసుకుంటానని దశరథం, లతల కూతురు ప్రీతి చెమ్మగిల్లిన కళ్లతో చెప్పడం కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేసింది. అన్నీ సరిగ్గా ఉన్న సోమరి తనంతో, నిర్లక్ష్యంతో బాధ్యత లేని జీవితాన్ని గడుపుతున్న కొందరికి దశరథం జీవితం కనువిప్పు కలిగించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal