సంచలనం సృష్టించిన వరంగల్ ఎంజీఎం (Warangal MGM) పేషెంట్‌పై ఎలుకల దాడి ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఎంజీఎం సూపరింటెండెంట్‌పై బదిలీ వేటు వేసింది. గతంలో సూపరింటెండెంట్‌గా వున్న చంద్రశేఖర్‌కు బాధ్యతలు అప్పగించింది. అలాగే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు వైద్యులను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కాగా, అంతకముందు మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) సైతం ఎంజీఎం ఘటనపై స్పందించారు. ఈ మేరకు రోగిని ఎలుకలు కొరికిన ఘటన (Rats bites on patient)పై విచారణకు ఆదేశిస్తున్నట్టుగా హరీష్ రావు గురువారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకొంటామని మంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కావొద్దని మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) వైద్య, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు
ఏం జరిగింది?
భీమారానికి చెందిన శ్రీనివాస్ అనే పేషెంట్ కిడ్నీ వ్యాధితో వారం రోజుల క్రితం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. అయితే శ్రీనివాస్ పరిస్థితి బాగా లేకపోవడంతో ఐసీయూ (ICU)లో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ చేతులు, కాళ్ల వేళ్ళను ఎలుకలు కొరికాయి (Rats bites on patient). ఆసుపత్రిలో చేరిన మొదటి రోజు శ్రీనివాస్ కుడిచెయ్యి వేళ్లను ఎలుకలు కొరికాయి. దీంతో గాయాలపాలైన శ్రీనివాస్ కు వైద్యులు కట్టు కట్టారు. ఆపై మళ్లీ ఈరోజు శ్రీనివాస్ కాళ్లను, ఎడమ చెయ్యి వేళ్ళను ఎలుకలు తీవ్రంగా గాయపరిచాయి (Rats bites on patient). దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో మళ్లీ వైద్యులు కట్టు కట్టారు.
ఎలుకలతో రోగుల ప్రాణాలకు ఇంతగా హాని జరుగుతున్న ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోవడం లేదని రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సిబ్బంది పని చేస్తున్నా రోగుల పరిస్థితి పట్టించుకోకపోవటంపై మండిపడుతున్నారు. ఐసియూ లో ఇటువంటి ఇటువంటి ఘటనలు జరగడం దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేయలేమని చెబుతున్నారని..
ఎలుకలు కొరకుతున్నాయని డాక్టర్ల దృష్టికి తీసుకెళితే, డాక్టర్లు ఎలుకలు కొరికిన చోట కట్లు కట్టి తామేమీ చేయలేమని చెబుతున్నారని రోగుల బంధువులు వాపోతున్నారు. పైపులైన్ ద్వారా ఎలుకలు లోపలికి వచ్చి పేషంట్లను కొరుకుతున్నాయని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఉంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకల బెడద ఇంతగా ఉంటే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఏం చేస్తున్నారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎలుకల నివారణకు చర్యలు తీసుకోలేరా అని ప్రశ్నిస్తున్నారు.
ఉత్తరతెలంగాణాలోనే అతి పెద్ద ఆస్పత్రి అయిన ఎంజీఎం ఆస్పత్రిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవటం వైద్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుందని అంటున్నారు. ఎలుకల బెడద పై ఆర్ఎం వో మురళి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వార్డుకు వెళ్లి పరిశీలించారు. ఎలుకలు నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోగి బంధువులతో మాట్లాడారు. అయితే ఘటనపై అడిషినల్ కలెక్టర్ శ్రీవాస్తవ విచారణ జరిపారు. ఈ మేరకు బాధ్యులైన ఆస్పత్రి సూపరింటెండెంట్, మరో ఇద్దరు వైద్యులపై చర్యలు తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.