హోమ్ /వార్తలు /తెలంగాణ /

Best Tourist Place: వీకెండ్‌లో లక్నవరం వెళ్తున్నారా?: అయితే ఈ అద్భుత దృశ్యం మిస్ కాకండి

Best Tourist Place: వీకెండ్‌లో లక్నవరం వెళ్తున్నారా?: అయితే ఈ అద్భుత దృశ్యం మిస్ కాకండి

లక్నవరం

లక్నవరం

హైదరాబాద్, వరంగల్ నగరాలకు అతి సమీపంలో ఉన్న లక్నవరం సరస్సు వారాంతపు పర్యాటకులతో సందడిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు ప్రకృతి వనాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Warangal, India

  (Venu Medipelly, News18, Mulugu)

  వీకెండ్ (Weekend) వచ్చిందంటే చాలు ఉద్యోగులు తమ కుటుంబాలతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. నగరంలో గజిబిజి జీవితానికి దూరంగా, సరదాగా రెండు రోజుల పాటు ప్రశాంతంగా గడిపేందుకు వారాంతాల్లో పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అలా హైదరాబాద్ (Hyderabad), వరంగల్ (Warangal) నగరాలకు అతి సమీపంలో ఉన్న లక్నవరం సరస్సు (Laknavaram lake) వారాంతపు పర్యాటకులతో సందడిగా మారుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అనేక పర్యాటక ప్రాంతాలు (Tourist Places) ప్రకృతి వనాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. వాటిలో అధిక శాతం ఏజెన్సీ ప్రాంతమైన ములుగు (Mulugu) జిల్లాలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా లక్నవరం సరస్సు గురించి మాట్లాడుకోవాలి. వీకెండ్, హాలిడేస్ వచ్చాయంటే అనేక మంది పర్యాటకులు రెక్కలు కట్టుకొని లక్నవరంలో వాలిపోతుంటారు. లక్నవరం ప్రకృతి అందాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

  ఒకప్పుడు కేవలం వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించే సరస్సుగా లక్నవరం సరస్సు ఉపయోగపడేది. కానీ గుట్టల నడుమ సరస్సు ఉండటం పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే ఎంతో మంది పర్యాటకులను ఆకర్శించవచ్చని తెలంగాణ పర్యాటకశాఖ ఇక్కడ అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తుంది. దానిలో భాగంగానే లక్నవరంలో వుడెన్ కాటేజీలు, గ్లాస్ కాటేజీలు, రెస్టారెంట్, స్పీడ్ బోట్, సైక్లింగ్ బోట్, వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.

  సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం ప్రత్యేకమైన రూములు కూడా ఏర్పాటు చేశారు. వారాంతాల్లో అనేకమంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సందడి చేస్తుంటారు. అయితే వచ్చే వారందరు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు లక్నవరం గడిపి వెళ్లిపోతున్నారు. దీంతో పూర్తిస్థాయిలో లక్నవరం అందాలని మాత్రం ఆస్వాదించలేకపోతున్నారు పర్యాటకులు.

  సరస్సు ఒడిలో ఒదిగిన సూర్యుడు:

  లక్నవరంలో చెరువు (Pond), వేలాడే వంతెన, చుట్టూ పచ్చని చెట్లు ఇవే కాదు... సూర్యుడు అస్తమించే దృశ్యాలు కూడా అద్భుతంగా ఉంటాయి. పొద్దంతా అలసిపోయిన సూర్యుడు సాయంత్రం లక్నవరం సరస్సు ఒడిలో విశ్రాంతి తీసుకోవడానికి వాలిపోతున్నాడా అనే విధంగా సూర్యాస్తమయం ఉంటుంది. నీలిమబ్బులో బంగారు వర్ణం అలుముకున్న వేళ, సూర్యుడు ఎర్రటి పండులా కనిపించే దృశ్యం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఈ అద్భుత సుందర దృశ్యాన్ని చూడాలంటే ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిందే. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ప్రత్యేకంగా రూంలు బుక్ చేసుకుని ఆ రూం బాల్కనీ నుంచి ఈ అందాలను తిలకించవచ్చు. చిరుజల్లులు పడుతుంటే లక్నవరం ఊయల వంతెన వయ్యారాలు పర్యాటకుల మనసును దోచేస్తుంటాయి.

  పర్యాటకుల కోసం లక్నవరం టూరిజం డిపార్ట్మెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని అక్కడి పర్యాటకశాఖ సిబ్బంది చెబుతున్నారు. లక్నవరం వచ్చే పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్లో రూములు బుక్ చేసుకొని వస్తున్నారని, రాబోయే రోజుల్లో లక్నవరం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయని లక్నవరం యూనిట్ మేనేజర్ కిరణ్ చెప్తున్నాడు. పర్యటక వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ కిరణ్, లక్నవరం యూనిట్ మేనేజర్: 9553639637.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Local News, Mulugu, Tourist place, Warangal

  ఉత్తమ కథలు