(Pranay Diddi, News 18, Warangal)
చరిత్ర ప్రకారం ఓరుగల్లు పాలనా కేంద్రంగా ఎందరో రాజులు తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేశారు. వీరిలో ప్రధానంగా కాకతీయ రాజులు (Kakatiya Kings) ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రజల అవసరాల కోసం..చెరువులు, ఊటబావులు తవ్వించడం సహా.. తమ పాలనాకాలంలో సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబించేలా శిల్పకళలు, కట్టడాలు, ఆలయాలు (Temples) నిర్మించారు. కాకతీయుల కాలం నాటి అనేక కట్టడాలు నేటికీ ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో చెక్కుచెదరకుండా ఉన్నాయి. అలాంటి ప్రాముఖ్య చరిత్ర ఉన్నటువంటి మరొక ఆలయం "శ్రీ పద్మాక్షి ఆలయం" (Sri Padmakshi Temple). 11వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన ఈ పద్మాక్షి (పద్మాక్షమ్మ) ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి .
జైన - హిందూ సంస్కృతుల కలయిక..
పద్మాక్షి దేవాలయం వరంగల్ (Warangal) జిల్లా హన్మకొండ (Hanamakonda) నగరం నడిబొడ్డున ఉంది. 10వ శతాబ్దంలో (10th Century) ప్రతాపరుద్రుడు వేయిస్తంభాల గుడి నిర్మాణం (1000 pillar temple) కంటే ముందే పద్మాక్షి గుడిని నిర్మించారని కొందరు చరిత్రకారులు వాదిస్తున్నా, అధికారికంగా మాత్రం ఈ ఆలయం 11వ శతాబ్దానికి చెందినదిగానే పేర్కొన్నారు. పద్మాక్షి గుట్టగా పిలువబడుతున్న కొండపైనా ఈ ఆలయం ఉంది. కొన్ని చారిత్రక ఆధారాలను బట్టి ఒకప్పుడు ఇక్కడ "బసది" అనే జైనమందిరం (Basadi Jain Temple) ఉండేదని చరిత్రకారులు చెపుతున్నారు. గుడి ఆవరణలో ఇప్పటికీ జైనతీర్ధంకరుల విగ్రహాలు ఉన్నాయి. అయితే కాకతీయ రాజుల పాలనలో తమ ఇలవేల్పు పద్మాక్షి దేవిని స్మరించుకుంటూ ఈ ఆలయాన్ని హిందూ ఆలయంగా మార్చినట్టు చరిత్ర చెబుతుంది. గర్భగృహంలో, ఒక భారీ తీర్థంకర పార్శ్వనాథ్ చిత్రం ఉంది. కుడివైపున యక్ష ధరణేంద్రుడు మరియు ఎడమవైపు పద్మావతి (పద్మాక్షి) దేవి చిత్రాలన్నీ రాతిపై చెక్కబడ్డాయి. ఈ రాతి శిల్పాలనే కాలానుగుణంగా మెరుగుపరిచి రంగులద్దారు.
నేటికీ ఈ ఆలయంలో జైన తీర్థంకరులు మరియు ఇతర జైన దేవతల శిల్పాలు ఉన్నాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం జైన దేవాలయం అయిన ఈ ఆలయం తరువాతి కాలంలో ప్రోలరాజు-II హిందూ దేవాలయంగా మార్చబడింది. కాకతీయ పాలకులు (Kakatiya Dyanasty) జైన మతం నుండి వీరశైవ మతంలోకి మారారు. ఈ ఆలయం బసది అని పిలువబడే చుట్టుపక్కల ప్రాంతాలకు జైన మతానికి ప్రముఖ కేంద్రాలలో ఒకటి. హిందూ దేవతలకు అంకితం చేయబడిన అనేక గొప్ప దేవాలయాలను కాకతీయ రాజులు నిర్మించారు. కాకతీయుల కాలంలో ఈప్రాంతంలో నిర్మించిన వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం మరియు సిద్ధేశ్వర దేవాలయం ఇక్కడకు సమీపంలోనే ఉన్నాయి.
ఒకే రోజు మూడు దశల రూపాలుగా దర్శనమిచ్చే అమ్మవారు..
భక్తులు కొంగుబంగారంగా కొలిచే పద్మాక్షి అమ్మవారి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు మూడు దశల్లో పద్మాక్షి దేవిని ఇక్కడ చూడవచ్చు; ఉదయం బాలికగానూ (Girl), మధ్యాహ్నం యువతిగానూ(Young woman), సాయంత్రం వృద్ధురాలిగానూ (Old woman) అమ్మవారు దర్శనమిస్తుంది. అమ్మవారి ఈ దశల రూపమే ఇక్కడి ప్రత్యేకత అని చెప్పవచ్చు. అంతే కాదు సంవత్సరానికి ఒకసారి బతుకమ్మ పండుగను పురస్కరించుకుని, పద్మాక్షి కొండ దిగువన ఉన్న చెరువులో పుష్పాలను నిమజ్జనం చేయడానికి లక్షలాది మంది మహిళలు ఇక్కడికి వస్తారు. దసరా, దుర్గాష్టమి కూడా ఇక్కడ జరుపుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు.
ఆలయం చుట్టూ ఎన్నో ప్రత్యేకతలు..
పద్మాక్షి అమ్మవారు కొలువైయున్న ఈ కొండ పై నుంచి చూస్తే దృశ్యాలు గంభీరంగా (Mesmirizing) ఉంటాయి. ఆలయంలో జైన తీర్థంకరుల గొప్ప శిల్పకళా ప్రతిమలను మనం చూడవచ్చు. సహజంగా ఏర్పడిన రాతి కొండపై ఆలయం చెక్కబడింది (Stone Carved).ఆలయ ఉత్తరాభిముఖంగా అంతఃపురం ఉంది. ఈ ఆలయంలో శివుడు, దుర్గాదేవి మరియు కృష్ణుడి విగ్రహాలు కూడా ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు ఒకే వంశానికి చెందిన అర్చకులు ఈ ఆలయంలో ప్రధాన అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ వంశానికి చెందిన ఏడో తరం వ్యక్తి నాగిళ్ల శంకరశర్మ ప్రస్తుతం ఆలయ పూజారిగా ఉన్నారు.
ఆలయ వేళలు, అక్కడికి ఎలా చేరుకోవాలి..
ఆలయం ఉదయం 5 గంటలకే తెరిచినా 6 గంటల తరువాతే భక్తులను అనుమతిస్తారు. పద్మాక్షి అమ్మవారి ఆలయంలో (Padmakshi Temple) ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు మరియు మధ్యాహ్నం 12 గంటలకు సాయంత్రం ఏడు గంటలకు అమ్మవారికి ప్రత్యేక హారతి ఉంటుంది. ఆన్లైన్ సేవలు ఇటువంటివి ఇక్కడ అందుబాటులో లేవు. ఆలయంలో ప్రత్యేక పూజల కోసం ఎటువంటి టికెట్స్ కూడా లేవు. ఒకవేళ భక్తులు ఎవరైనా ప్రత్యేక పూజ చేయించుకోవాలి అనుకుంటే నేరుగా అర్చకులను సంప్రదించాల్సి ఉంటుంది. పద్మాక్షి అమ్మవారికి భక్తులు కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు మరియు పట్టు చీరలు సమర్పిస్తారు. ఆలయంలో అన్ని హిందూ పండుగలను జరుపుకుంటారు.
పద్మాక్షి ఆలయ సమీపంలో వసతి..
ఆలయం హన్మకొండ, వరంగల్లో ఉండడంతో చాలా వరకు భక్తులు నగరంలో ఉండే హోటళ్లలో బస చేస్తారు. తెలంగాణ పర్యాటకశాఖ నిర్వ్హలించే హరిత హోటల్ అనేక సౌకర్యాలు కల్పిస్తుంది.
రోడ్డు మార్గం..
ఈ ఆలయం వరంగల్ - హైదరాబాద్ హైవే (Warangal -Hyderabad Highway)సమీపంలో హన్మకొండ (Hanmakonda)నడిబొడ్డున ఉంది. రోడ్డు, రైలు మార్గంలో హన్మకొండ చేరుకొని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఈఆలయానికి చేరుకోవచ్చు.
ఆలయ చిరునామా మరియు ఫోన్ నెంబర్:
పద్మాక్షి టెంపుల్ రోడ్,
శ్రీ రామ్ కాలనీ, మీర్పేట్,
హన్మకొండ, వరంగల్,
సంప్రదింపు నంబర్: 9908763228
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hindu Temples, Local News, Temple, Warangal