హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kakatiya: కాకతీయులు ముందుచూపుతో చేసిన పనే నేటి మిషన్​ భగీరథకు ఊపిరి పోసింది.. ఇంతకీ వాళ్లు చేసిన పనేంటి?

Kakatiya: కాకతీయులు ముందుచూపుతో చేసిన పనే నేటి మిషన్​ భగీరథకు ఊపిరి పోసింది.. ఇంతకీ వాళ్లు చేసిన పనేంటి?

X
ప్రతీకాత్మక

ప్రతీకాత్మక చిత్రం

మిషన్​ భగీరథ, మిషన్​ కాకతీయ. ఈ రెండు తెలంగాణలో ఎంత పెద్ద ప్రాజెక్టులో అందరికీ తెలిసిందే. తాగు సాగు నీటికి ఈ రెండు పథకాలు ఎంతో ముఖ్యమైనవి. అయితే అప్పట్లో కాకతీయులు ముందుచూపుతో చేసిన పని ఈ ప్రాజెక్టులకు ఊపిరి పోశాయనే చెప్పవచ్చు.

(Pranay Diddi, News 18, Warangal)

11వ శతాబ్దంలో కాకతీయ (Kakatiya) సామ్రాజ్యాన్ని పాలించిన గణపతి దేవుడు రాజ్య ప్రజలకు తాగు-సాగు నీటికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని ఆలోచించి అనేక చెరువులను తవ్వించాడు. నాటి నుంచి నేటి వరకు ఆ చెరువుల్లోని నీటితో వేల ఎకరాల్లో రైతులు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు. కాకతీయులు నిర్మించిన అటువంటి గొలుసుకట్టు చెరువులు (Chain ponds) నేడు మిషన్ కాకతీయ (Mission Kakatiya), మిషన్ భగీరథలోనూ (Mission Bhagiratha) భాగం అయ్యాయి. భవిష్యత్ తరాల కోసం అలనాడు కాకతీయులు ఎంతో ముందుచూపుతో ఆలోచించి నిర్మించిన ఆ చెరువుల వలనే నేటికీ సాగు, తాగు నీటికి ఎటువంటి ఢోకా లేకుండా వరంగల్ జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారు.

కేవలం వర్షాధారంగా వ్యవసాయం చేసే భూములను, దేవ మాతృకలని.., నదులు, వాగులు, చెరువులు, కాలువలు, చెలిమలు ఆధారంగా సేద్యం చేసే భూములు నదీమాతృకలని పిలువబడేవి. ఈ రెండిటి కంటే ఎక్కువగా ఆనాడు బీడు భూములు ఉండేవి. కొండలు, గుట్టలు, అడవులు, రాతి నేలలతో కూడి ఉన్నప్పటికీ తెలంగాణలో నదులు, వాగుల తీరాలలో తేలికగా వ్యవసాయం చేయదగిన భూమి ఎంతో ఉండింది. తగినంత వర్షపాతం కూడా ఉంటుండటంతో రాష్ట్రంలో వానాకాలంలో నదులు, వాగులలో నీరు తగినంత ప్రవహించేది. అయితే వర్షాలు కురిసినప్పుడే వాగులు, నదుల్లో చేరిన నీరు, కొన్ని రోజులకే వృధా అయిపోయేది. నదీగర్భంలోని చెలిమలు, తీరంలోని చిన్నచిన్న కాలువల్లో మాత్రమే నీరు నిల్వఉండేది. ఇవి అనాదిగా ఉన్న స్థితిగతులు.

వర్షం వల్ల లభించిన నీటిని వృథా కానీయకుండా, ఆ నీటిని జలాశయాల్లోకి మళ్ళించి సారవంతమైన భూమిని సాగులోకి తెచ్చి రాజ్యాన్ని పాడిపంటలతో సమృద్ధం చేయవచ్చని కాకతీయులు తెలుసుకున్నారు. ఆనాడు పెద్ద తటాకాలు నిర్మించడం గొప్ప విజ్ఞానం. నదీమార్గంలో నది రెండు కొండల మధ్య ప్రవహిస్తున్నచోట రాళ్ళను, మట్టిని వినియోగించి ఆనకట్టకట్టి గొప్ప తటాకాన్ని నిర్మించేవారు. సారవంతమైన భూమికి నీరు అందే చోటును ఎన్నుకొనేవారు.

కేసరి సముద్రం:

మోటుపల్లి, బయ్యారం శాసనాలనను గమనిస్తే, మొదటి ప్రోలరాజు అరిగజకేసరి అన్న తడ ప్రఖ్యాత బిరుదు మీదుగా ఒక తటాకాన్ని తవ్వించి దానికి కేసరి తటాకమని పేరు పెట్టించాడు. వరంగల్ జిల్లా మహబూబాద్‌ తాలూకాలోని కేసముద్రం (కేసరి సముద్రం) గ్రామ సమీపంలో దీనిని గుర్తించవచ్చు. మొదటి ప్రోలరాజు కుమారుడు రెండవ బేతరాజు.. సెట్టికెరియ, కేసరి సముద్రం అనే రెండు చెరువులు వేయించినట్లు హనుమకొండ శాసనం తెలుపుతున్నది. రెండవ ప్రోలరాజు కూడా కొన్ని సాగునీటి చెరువులు తవ్వించి వాటి కింద భూములను దానం చేసినట్లు ఇదే శాసనంవల్ల తెలుస్తుంది. రుద్రదేవుడు ఉదయబోడుని పట్టణాన్ని జయించి అక్కడ ఒక పెద్ద చెరువును నిర్మించినట్లు హనుమకొండ శాసనం తెలుపుతున్నది. ఇపుడు హనుమకొండ బస్టాండు వద్ద కనిపించే చెరువును రుద్రదేవుని మంత్రి గంగాధరుడు నిర్మించినట్లు హనుమకొండ శాసనం తెలియజేస్తుంది.

తెలుగు చోళుల రాజధానులైన నెల్లూరు, కృష్ణా జిల్లాలోని గణపురం వంటి ప్రాంతాలలో గణపతిదేవుడు అనేక తాటాకాలు నిర్మించినట్లు ప్రతాపచరిత్ర తెలుపుతున్నది. ఈ కాలపు శాసనాలలో గణపతి సముద్రమనే పేరుతో గణపతిదేవుడు స్వయంగా నిర్మించినవి, అతని సామంత, మాండలికులు నిర్మించినవి అనేక తటాకాలు తెలుగు రాష్ట్రాల్లో నేటికీ ఉన్నాయి. నాగర్‌కర్నూలులో కూడా కేసరి సముద్రం అని పిలువబడే కాకతీయులనాటి 'పెద్ద చెరువు' నేటికీ వ్యవసాయానికి సాగు నీరు అందిస్తుంది. ఆ కాలపు ఈ చెరువులన్నీ తెలంగాణలో ఇప్పటికి సాగునీటి వనరులుగా విశేషమైన పాత్రను నిర్వహిస్తూ భూమిని సస్యశ్యామలం చేస్తున్నవి.

పాకాల చెరువు:

ఈ చెరువు వరంగల్ తూర్పున 50 కి.మీ. దూరంలో నర్సంపేట తాలూకాలో మానేరు పరీవాహక ప్రాంతంలో ఉన్నది. చెరువు నలువైపుల అడవి వ్యాపించి ఉన్నది. మొత్తం చెరువు కాలువలు 80 చదరపు మైళ్ళు పరుచుకొని ఉన్నవి. చెరువు ఎండిపోయిన సందర్భాలు లేవు. ఈ చెరువు కట్టమీద శాసనం గణపతిదేవ మహారాజు కాలంలో ఆయన మంత్రి బయ్యన నాయకుడు, బాచమాంబల కుమారుడు అయిన జగదాలు ముమ్మడి నిర్మించినట్లు తెలుపుతున్నది.

రామప్ప చెరువు:

వరంగల్‌కు 65 కి.మీ. దూరంలో, ములుగు తాలూకా పాలంపేట సమీపంలో ఈ చెరువు (Pond) ఉంది. శాతవాహన శతకం 1135లో (క్రీ.శ. 1213లో) దీనిని గణపతిదేవుని సేనాని రేచెర్ల రుద్రుడు నిర్మించినట్లు సమీపంలోని శివాలయంలోగల శాసనం తెలుపుతున్నది. ఈ చెరువు ప్రక్కనే ఉన్న సుప్రసిద్ధమైన రామప్ప దేవాలయాన్ని కూడా ఈ చెరువుతోపాటే నిర్మించారు.

ఘనపురం చెరువు :

రామప్ప చెరువు (Ramappa cheruvu) నిర్మించిన కాలంలోనే దీని నిర్మాణం జరిగింది. దీని క్రింద సాగయ్యే భూమి 350 ఎకరాలు.

లక్ణవరం చెరువు :

కాకతీయుల(Kakatiya) కాలపు పెద్ద చెరువులలో ఇది ఒకటి. లక్ణవరం చెరువు, పాకాల చెరువు, ఖమ్మం (Khammam) జిల్లాలోని బయ్యారం చెరువులకు మూడు పెద్ద వాగుల నుండి నీరు చేరుతుంది. ఒక పెద్ద పీఠభూమి ఆయకట్టుగా ఈ వాగులు మూడు దిక్కులకు ప్రవహిస్తున్నవి. గణపతి దేవుని సోదరి, నతవాడి రుద్రుని భార్య మైలాంబ బయ్యారం చెరువును నిర్మించింది. ఈ సందర్భంగా వేయించిన శాసనం కాకతీయ వంశజుల తొలి చరిత్రను తెలుసుకొనే కొరకు ఎంతో ప్రామాణికంగా పరిగణించబడింది.

ధర్మసాగర్ చెరువు:

ధర్మసాగర్ చెరువు గత 30 సంవత్సరాలుగా వరంగల్‌ నగర త్రాగునీటి ప్రధాన వనరుగా ఉంది. వరంగల్ నగర అవసరాలు తీర్చే మూడు వేసవి నిల్వ ట్యాంకులలో ఒకటి ఈ ధర్మసాగర్ చెరువు. నగర ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు 50,000 ఎకరాలకు సాగునీరు అందించడానికి 1.5 tmcft నీటిని నిల్వ చేయడానికి దేవాదుల ప్రాజెక్ట్ యొక్క బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా సరస్సు నుండి ధర్మసాగర్ సెరువును పునర్నిర్మించారు.

వరంగల్ (Warangal), ఖమ్మం, కరీంనగర్‌ (Karimnagar), నిజామాబాదు, నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలలో చెరువులేని గ్రామం లేదంటే అతిశయోక్తికాదు. కొన్ని గ్రామాల్లో 4, 5 చెరువుల వరకు ఉన్నవి. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని కందూరులో చెరువులు, కుంటలు మొత్తం 40 వరకు ఉన్నవి. వర్షపు నీరు వృధాగా పోకుండా చిన్నచిన్న వాగులకు, ఓడికలకు అడ్డుకట్టలువేసి పల్లె ప్రజలు ప్రభుత్వ సహకారంతో కుంటలు నిర్మించుకొనేవారు. దీనివల్ల సారవంతమైన నేల కొట్టుకొని పోకుండ ఉండేది. రానురాను వాన తాకిడికి కట్టలు తెగిపోవడంవల్ల, గండిపూడ్చుటకై ప్రభుత్వాలు చొరవచూపక పోవడంవల్ల ఎన్నో కుంటలు, చెరువులు పాడువడిపోయినవి.

కాలువలు:

ఊరి చివర నుండి నదులు, వాగులు ప్రవహిస్తే..పైనుండి కాలువలు త్రవ్వి తీసుకొనివచ్చి, తీరప్రాంత భూములకు నీటిని మళ్ళించి సేద్యం చేసేవారు. వేసవిలో ప్రవాహం లేనపుడు నది నుండి ఇసుకలో కాలువలు తీసి, ఆ ఊట కాలువలద్వారా నీటిని తెచ్చి పంటలు పండించే వారు. మూసీ నుండి మూసేటి కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఉత్తమ గండకాలువ, ఉటుం కాలువ, చింతల కాలువ మొదలైన కాలువలు ఏర్పడినట్టు శాసనాల్లో పేర్కొనబడినవి. మోట, రాట్నాలు, ఏతాములతో నీరు తోడి పంటలు పండించే పద్ధతి కాకతీయుల కాలంలో వాడుకలో ఉండేది. లోతైన బావుల నుండి నీరు తోడేందుకు మోటకు, రాట్నాలకు ఎద్దులను వాడేవారు. ఇలా అనేక చెరువులను తొలగించి ప్రజా శ్రేయస్సు పొందిన కాకతీయులు చరిత్రలో నిలబడ్డారు. నాటి నుండి నేటి వరకు వారు నిర్మించిన కట్టడాలు, చెరువులకు ఓ ప్రత్యేకత సార్ధకత ఏర్పడిందని చెప్పవచ్చు.

First published:

Tags: Khammam, Mission Bhagiratha, Warangal, Water

ఉత్తమ కథలు