Santosh, News18, Warangal
వరంగల్ జిల్లా (Warangal District) మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి గోపి ఆకస్మిక బదిలీ వెనుక ఆసక్తికర పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. బదిలీకి రాజకీయ ఒత్తిళ్లే కారణమని అనుకుంటున్నారు. ఆ రాజకీయ ఒత్తిళ్లు వచ్చేందుకు కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి నిర్వాహకమే కారణమని అనుకుంటున్నారు. ఓ మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేల ఫైల్ పనులను పూర్తిచేయకపోవడంతోనే బదిలీ ప్రధాన కారణంగా తెలుస్తుంది. ముఖ్యమైన ఫైళ్ళ బాధ్యతలను కలెక్టర్ సదరు అధికారికి అప్పగించగా అతను ఫైళ్లను పెండింగ్ లో పెట్టి.. కలెక్టరే ఈ ఫైళ్లని పెండింగ్ లో పెట్టారని ఆయా నేతల ముఖ్య అనుచరులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలే కలెక్టర్ గోపి బదిలీకి కారణమయ్యాయని జిల్లాలో ప్రచారం జరుగుతుంది.
ఈ క్రమంలోనే నూతనంగా వరంగల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రావీణ్యరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగుల విషయంలో ఆచితూచి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకుంటున్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న ఓ అధికారి కలెక్టర్ కు విధేయుడిగా మారడం.. సిన్సియర్ అధికారిగా కలెక్టర్ కు మెదలడంతో అతనికే కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. బాధ్యతలే కాదు ఆయన సలహాలు సైతం ఐఏఎస్ అధికారి పాటించేలా ఆకట్టుకున్నట్టుగా కార్యాలయంలో ప్రచారం జరుగుతోంది.
దీంతో ముఖ్యమైన ఫైళ్లను క్లియర్ చేయించే బాధ్యత, పర్యవేక్షణను క్యాంపు కార్యాలయంలో కీలకంగా పని చేస్తున్న ఆ అధికారికి కలెక్టర్ గోపి అప్పగించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో మంత్రి, ఎమ్మెల్యేల అనుచరులకు సదరు అధికారి చుక్కలు చూపెట్టినట్టుగా సమాచారం. దీంతో కలెక్టర్ ఆదేశాలతోనే ఫైల్స్ క్లియరెన్స్ కావడం లేదన్న తప్పుడు అభిప్రాయాన్ని సదరు నేతల అనుచరులకు చేరింది.
ఆ అనుచరులు ఇద్దరు ఎమ్మెల్యేల వద్దకు తీసుకెళ్లగా.. వారు మంత్రికి చేరవేశారు. మంత్రి సిఎస్ కు ఫిర్యాదు చేయడం, ఫైల్స్ పెండింగ్ విషయం నిర్ధారించుకున్నాకే గోపిపై బదిలీ వేటు పడినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇందులో ఐఏఎస్ అధికారి కావాలని చేసింది ఏమీ లేకున్నా సదరు కీలక అధికారి మాత్రం ఫైల్స్ ను తొక్కిపెట్టి ఆయన బదిలీకి కారణమయ్యారన్న చర్చ అధికారుల్లో జరుగుతోంది.
కాగా, ఐఏఎస్ అధికారి గోపి ఆకస్మిక బదిలీ తర్వాత వరంగల్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ప్రావిణ్య అప్పటివరకు వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా కొనసాగుతున్నారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అవగాహన, పాలనా అనుభవంతో వరంగల్ జిల్లాను ముందుకు నడిపించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తమ మాటే శాసనం అని చెప్పుకునే కొంతమంది అధికారులతో కలెక్టర్ జాగ్రత్తగా ఉండాలని కొంతమంది అధికారులు చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal