సంతోష్ కుమార్, న్యూస్ 18, వరంగల్
వరంగల్ నగరంలో చిట్ ఫండ్స్ ఆగడాలకుఅడ్డూ అదుపు లేకుండా తయారైంది. గతంలో వారిపై చీటింగ్ కేసులు, క్రిమినల్ కేసులు నమోదు అయినా వారి ప్రవర్తనలో మార్పు లేదు. మీరేం చేసినా మా దారి మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ చిట్ ఫండ్స్ కంపెనీల యజమానులు. చిట్ ఫండ్స్ కంపెనీల మోసాలపై ఇటీవల యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి ఖాతాదారులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే డబ్బులు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయా సంస్థల చైర్మన్ లను హెచ్చరించారు.
ఈ సమావేశంలో అంతా సీపీ ఎదుట ఒప్పుకున్నా.. కంపెనీల చైర్మన్లు ఖాతాదారులకు పాతపాటే వినిపిస్తున్నారు. అయితే, ఈసారి కొంత రూటు మార్చారు. ఇప్పట్లో డబ్బు చెల్లించడం కష్టమే.. మీకు ఇష్టం ఉంటే ప్లాట్లు తీసుకోండి.. లేకుంటే ఆరు నెలలు ఆగాల్సిందే అని ఖాతాదారులకు చెప్తున్నారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కు కూతవేటు దూరంలో ఉన్న ఓ చిట్ ఫండ్ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు ఖాతాదారులకు ఇదే మాట తెగేసి చెప్తున్నారు. ఇక్కడితో ఈ ఆఫర్ ముగియలేదు. చిట్ ఫండ్ కంపెనీలు ఇస్తామన్న ఆ ప్లాట్లు కూడా వరంగల్ ప్రాంతంలోవి కాదట.. ఖమ్మంలో ఓ మారుమూల ప్రాంతంలోనివి. దీంతో ఖాతాదారులు చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
దీంతో చిట్ఫండ్ సంస్థలపై నమోదైన కేసులలో.. డబ్బులు చెల్లించకుండా ఖాతాదారులను ఇబ్బందులకు గురిచేసిన యజమానుల గురించి పోలీస్ కమిషనర్ ఆరా తీశారు. ఖాతాదారులకు చెల్లింపుల్లో ఆలస్యం చేయడానికి కారణాలను ఆయా చిట్ఫండ్ సంస్థల యజమానులను అడిగి తెలుసుకున్నారు. చిట్ఫండ్ సంస్థల యజమానులు సమస్యలను పరిష్కరించే విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలని, డబ్బులు చెల్లింపుల వివరాలను పోలీసు అధికారులకు అందజేయాలని సూచించారు.
చిట్ఫండ్ సంస్థల వారీగా ఖాతాదారులకు చెల్లించాల్సిన వివరాలు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్లో పెడతామని వెల్లడించారు. ఇకపై ప్రభుత్వ నిబంధనలకు మేరకు నిర్వాహకులు నడుచుకోకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. దీనికోసం దర్యాప్తునకు పోలీస్ బృందాన్ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
బాధితులు చిట్ ఫండ్ సంస్థల చుట్టూ తిరుగుతున్నా కంపెనీలు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. మరో ఆరు నెలలు ఆగినా తమ డబ్బులు చేతికి వస్తాయో రావోనన్న నమ్మకం కుదరడం లేదు. ఇలాంటి గడువులు ముగిసిన కొద్దీ కొత్త గడువులతో ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారంటూ బాధితులు వాపోతున్నారు. మరి పోలీసులు చిట్ ఫండ్స్ యజమానులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. బాధితులకు ఎలాంటి న్యాయం చేస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal