WARANGAL PATIENT INJURED IN A RAT ATTACK AT WARANGAL MGM DIED WHILE UNDERGOING TREATMENT AT NIMS SNR
HYDERABAD:వైద్యం కోసం వెళ్తే ఎలుకలకు అప్పగించారు..నిమ్స్‌లో ప్రాణాలు విడిచిన ఎంజీఎం రోగి
(ఎంజీఎం రోగి నిమ్స్‌లో మృతి)
HYDERABAD:వరంగల్ ఎంజీఎంలో ఎలుకలు కొరుక్కుతిన్న రోగి నిమ్స్‌లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. రోగి శ్రీనివాస్ శరీరం పూర్తిగా ఇన్ఫెక్షన్ కావడం వల్లే వైద్యానికి సహాకరించలేదని వైద్యులు తెలిపారు. వరంగల్ నుంచి నిమ్స్‌కు తెచ్చిన గంటల వ్యవధిలోనే రోగి మృతి చెందడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వరంగల్ (Warangal)ఎంజీఎంలో ఎలుకలు (Rats)కొరుక్కుతిన్న రోగి శ్రీనివాస్ చనిపోయాడు. నిమ్స్(Nims)లో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి(Died) చెందినట్లుగా డాక్టర్లు(doctors) ధృవీకరించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నిమ్స్ వైద్యులు శ్రీనివాస్‌కి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. ఎలుకలు కొరుక్కుతినడం వల్ల శ్రీనివాస్‌కి ఎంజీఎం (MGM) లోనే అధికరక్తస్రావం అయింది. అపస్మారకస్థితిలో ఉన్న అతడ్ని శుక్రవారం(Friday) సాయంత్రం నిమ్స్‌కు తరలించారు. అప్పటి నుంచి రాత్రి 12గంటల వరకు నిమ్స్ వైద్యులు శ్రీనివాస్‌ని కాపాడేందుకు మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేశారు. అయితే శ్రీనివాస్ (Srinivas)ను నిమ్స్‌కి తరలించే సమయానికే శరీరం అంతా ఇన్ఫెక్షన్ (Infection)అయిందని..వైద్యానికి సహాకరించకపోవడం వల్లే మృతి చెందినట్లుగా నిమ్స్ వైద్య బృందం స్పష్టం చేసింది. గత వారం రోజుల క్రితం శ్రీనివాస్ కిడ్నీ సంబంధిత వ్యాధితో వరంగల్‌లోని ఎంజీఎంలో చేరాడు. ఉత్తర తెలంగాణకే అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఎంజీఎంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఐసీయూలో ట్రీట్మెంట్(Treatment) పొందుతున్న శ్రీనివాస్‌ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఇన్‌పేషెంట్‌గా ఉన్న శ్రీనివాస్‌ని ఐదు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎలుకలు దాడి చేశాయి. రోగి అచేతన స్థితిలో ఉండటంతో ఎలుకలు మొదటిసారి చేతి వేళ్లు కొరకాయి. ఎంజీఎంలోని వైద్య సిబ్బంది కట్టుకట్టి చేతులు దులుపుకున్నారు. ఆతర్వాత మరోసారి శ్రీనివాస్ ఎడమ చేయి, కాలి మడమ కొరకడంతో తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో అతను అపస్మారకస్థితికి చేరుకున్నాడు.
నిర్లక్ష్యానికి ఒకరు బలి..
ఐసీయూ వార్డులోకి ఎలుకలు వస్తున్న విషయం తెలిసి కూడ ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. హనుమకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్ (42) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ గత నెల 26న ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఆర్ఐసీయూ వార్డుకు తరలించి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించారు. గత నెల 27న శ్రీనివాస్ కుడిచేతి వేళ్లను ఎలుకలు కొరికినట్లు బంధువులు గమనించారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు కట్టుకట్టి చేతులు దులుపుకున్నారు. గత నెల 30న అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌పై ఎలుకలు మరోసారి దాడి చేయడంతో విషయం బయటకువచ్చింది.
సర్కారు దవఖానాలు ఇంతేనా..
ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితేమిటీ అనే విమర్శలు రావడంతో ఆసుపత్రిలోని సంబందిత వైద్యసిబ్బందిపై తెలంగాణ వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మీడియాలో కథనాలు రావడంతో వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీవాస్తవ ఘటనపై ఆరా తీశారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనులు సరిగా చేయకపోవడం వల్లే ఎలుకలు వ్యాప్తి చెందినట్లుగా ప్రాథమిక నిర్ధారణలో తేలింది. అయితే ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు విచారణకు ఆదేశించారు. వెంటనే నివేదిక తెప్పించుకున్న మంత్రి హరీశ్‌రావు సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు వైద్యుల సస్పెన్షన్ వేటు వేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.