హనుమకొండ రవాణా శాఖ కార్యాలయంలో గత కొద్ది నెలలుగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీటు ఖాళీగా ఉంది. గతంలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కావడంతో సీట్ ఖాళీ అయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆ సీటు అలానే ఉండిపోయింది. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉపయోగించాల్సిన సీసీఏ రోల్ ను కూడా తన ఇష్టానుసారంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వాడుతూ అనేక ఫైళ్లను నిబంధనలకు విరుద్ధంగా అప్రూవల్ చేసి మామూళ్లు గట్టిగానే వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇక్కడ కార్యాలయానికి పరిపాలన అధికారి వస్తే ఎక్కడ తన ఆదాయం తగ్గుతుందోనని భావించిన డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏవో రాకను అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. తనకు నెలవారీగా, రోజువారిగా వచ్చే మామూళ్లు సరిపోవు అన్నట్లు భావించిన సదర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఏవోకు సంబంధించిన రోజువారి మామూళ్లు కూడా వసూళ్లు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అయితే ఈ ఆరోపణల విషయంపై డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తంను న్యూస్ 18 వివరణ కోరగా.. ఆయన స్పందించారు. గత కొంతకాలంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీటు ఖాళీగా ఉన్న విషయం మాత్రం నిజమేనని, జిల్లాల విభజన అయిన తర్వాత సిబ్బంది కొరత రావడంతో పలుమార్లు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు సిబ్బందిని భర్తీ చేయాల్సిందిగా దరఖాస్తు కూడా పెట్టినట్లు తెలిపారు.
అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా తమపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వరంగల్ , హనుమకొండ జిల్లాకు గాను ఒక్క అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మాత్రమే ఉన్నాడని.. హనుమకొండ రవాణా శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉన్నా కూడా తాము సర్దుకుపోయి పని చేసుకుంటున్నామని అన్నారు. దరఖాస్తు పెట్టుకొని నెలలు గడుస్తున్నా ఇంతవరకు సిబ్బందిని భర్తీ చేయకపోవడం తమ తప్పు కాదని హనుమకొండ రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పురుషోత్తం అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadradri kothagudem, Local News, Telangana