రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
బ్రతికుండగానే అధికారులు రికార్డులో చంపేశారు. తాను బ్రతికే ఉన్నానని ఆ వృద్ధుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు అండగా ఆసరా పించన పథకం ప్రవేశపెడితే దాని అమలులో అధికారుల నిర్లక్ష్యంతో ఓ వృద్ధుడు ఆసరా కోల్పోయిన పరిస్థితి దాపురించింది. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నురు గ్రామానికి చెందిన కేసరపు సారయ్య అనే(75) ఎస్టీ కులానికి చెందిన వృద్ధుడు గత 8 సంవత్సరాలుగా పింఛను రావడంలేదని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తే.. వస్తదని దాటేశారు.
మొన్న జరిగిన ఉప ఎన్నికల సమయంలో కూడా ప్రజాప్రతినిధులు, అధికారులను బ్రతిమిలాడినా కానీ తనకు పింఛన్ మంజూరు కాలేదని.. ఏళ్ళ తరబడి నిరీక్షించి చివరగా మండల అధికారులను కలిస్తే తాను చనిపోయినట్లు రికార్డులో ఉండడం వల్ల పింఛను రావడంలేదని మండల అధికారులు తెలిపారని వాపోయాడు.
బతికుండగానే చనిపోయినట్లు నిర్లక్ష్యంగా రికార్డులకు ఎక్కించి తనకు రావలసిన ఫించను రాకుండా చేసిన అధికారులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని వృద్ధుడు కోరుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముందు తనకు 200 రూపాయల పింఛను వచ్చేదని, ఆ తర్వాత పింఛను తొలగించడంతో ఇప్పుడు ఎలాంటి ఆసరా లేక, కాలు విరిగి పని చేయలేని పరిస్థితిలో అవస్థలు పడుతున్నానని అన్నాడు.
జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించి అసలు లోపం ఎక్కడ ఉంది అని పునరాలోచన చేసి ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సారయ్య కూతురు కోమలి వేడుకుంది. గ్రామంలోని పెద్దలు మాకు పించన్ రాకుండా చేస్తున్నారని, మేము ఎవరికి అన్యాయం చేయలేదని, ఇప్పటికైనా తమకి న్యాయం చేయాలని సారయ్య భార్య కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal