Santosh, News18, Warangal
వరంగల్ (Warangal) ప్రజలకు కోతుల కష్టాలు తప్పడం లేదు. వందల సంఖ్యలో ఊర్లోకి వస్తున్న కోతులు కనిపించిన వస్తువులన్నింటిని చిందరవందర చేస్తూ దొరికిన ఆహారాన్ని ఇంట్లోకి వెళ్లి తినేస్తున్నాయి. కోతుల దాడిలో చాలామంది గాయపడ్డారు. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు చెప్పినా ప్రజాప్రతినిధులకు చెప్పినా తగిన చర్యలు తీసుకోవడం లేదు అంటున్నారు ప్రజలు. గతంలో కనుమకొండ మండలం నాగూర్లపల్లి గ్రామానికి చెందిన శిరీష గత ఏడాది మే నెలలో కోతుల దాడిలో బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయింది. శిరీష హనుమకొండలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఎంసీఏ చదువుతోంది. కోతుల గుంపు గదిలోకి రావడంతో రూమ్ లో ఉన్నవాళ్లంతా బయటకు పరుగులు తీశారు. శిరీష కూడా పరిగెడుతూ కాలుజారి గోడపై నుంచి కిందపడి మరణించింది.
ఎల్కతుర్తి మండలంలో నలుగురు కోతుల దాడిలో గాయపడ్డారు. కస్తూరిబా గర్ల్స్ హాస్టల్లో ఆరో తరగతి విద్యార్థిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. ఇళ్లపైకి ఎక్కి పెంకులు పీకేస్తున్నాయి. నగరంలో ఉన్న కోతులు ఇళ్లలో దూరి సంచులు, డబ్బాలు అన్నం దొరికినవన్నీ ఎత్తుకుపోతున్నాయి. వస్తువులను చిందర వందర చేస్తున్నాయి. ఇళ్లలోని చెట్లను చెట్ల కుండీలను ధ్వంసం చేస్తున్నాయి. కోతుల దాడిలో గాయపడిన వారు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు ప్రజలు.
వరంగల్ కేంద్రంలోని శివనగర్లో ఓ వృద్ధురాలు సాయంత్రం పూట అరుగుపై కూర్చుని ఉంది. అయితే ఒకసారిగా ఒక కోతి తనపై దాడికి దిగింది. భయపడి పరుగులు తీస్తున్న వృద్ధురాలిపై కోతుల గుంపు ఏకధాటిగాదాడికి పాల్పడ్డాయి. దాంతో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. కోతుల దాడిలో గాయపడిన వృద్ధురాలు ఎన్నిసార్లు ఏరియా కార్పొరేటర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ వాపోయింది.
కోతుల బెడదతో పిల్లలను ఒంటరిగా బయటికి పంపించాలన్నా, స్కూలు నుండి ఇంటికి వచ్చేటప్పుడు కోతులు దాడి చేస్తాయేమోనని భయపడుతున్నారు. ఇంటి బయట బట్టలను వేస్తే బట్టలను చింపేస్తున్నాయి. ఇంట్లోకి చొరబడి వస్తువులను చిందరవందర చేస్తున్నాయి. కనీసం సాయంత్రం పూటైనా అలా చల్లగాలికి అరుగుపై కూర్చుందామంటే ఎప్పుడు కోతులు దాడి చేస్తాయని భయపడాల్సిన పరిస్థితని ప్రజలు వాపోతున్నారు. తమ ఏరియా కార్పొరేటర్ కి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ స్థానిక మహిళలు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal