WARANGAL MAHABUBABAD HAS BECOME A HUB FOR CRIME SNR KMM
Mahabubabad: గంటకో గొడవ..రోజుకో దాడి..మానుకోటలో పెరుగుతున్న క్రైమ్ రేట్
(నేరాల అడ్డా)
Telangana:మహబూబాబాద్‌లో క్రైమ్ రేటు విచ్చలవిడిగా పెరుగుతోంది. ఇల్లీగల్ బిజినెస్‌లు, పొలిటికల్ వైషమ్యాలతో రోజుకో చోట ఘర్షణలు, దాడులు జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో ఇద్దరు టీఆర్ఎస్ నాయకులపై దాడి జరగడం చూస్తుంటే ఈ పరిణామం ఇంకా ఎంతటి ప్రమాదకరపరిస్థితుల్ని సృష్టిస్తుందోనని భయపడిపోతన్నారు స్థానికులు.
(G.SrinivasReddy,News18,Khammam)
మానుకోట ఇది ఒకప్పటి పేరు. మహబూబాబాద్ (Mahabubabad)ప్రస్తుతం పిలవబడుతున్న పేరు. అప్పుడు పట్టణం. ఇప్పుడు జిల్లా కేంద్రం. వరంగల్(Warangal)ఒక్క జిల్లాగా ఉన్నప్పుడు అత్యధిక విస్తీర్ణంలో ఉన్న ఈ డివిజన్ జిల్లాగా మారడంతో ఇక్కడ నేరాల సంఖ్య, ఆర్ధిక లావాదేవీలు, ఆక్రమణలు, అక్రమాలు, రాజకీయ ఆధిపత్యం కోసం పార్టీల మధ్య గొడవలతో నేరాల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ హత్యలు(Murders)దౌర్జన్యాలు, నేరాలు, డబ్బు వసూళ్లు విచ్చలవిడిగా పెరిగాయి. అనధికార చిట్‌ఫండ్స్ (Chitfunds) ఎక్కువగా ఉండటం వల్ల వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవడంతో వసూళ్ల దందా బాగా పెరిగిపోయింది. రియల్ ఎస్టేట్(Real Estate)ఫైనాన్స్ బిజినెస్ (Finance Business)లో ఆర్ధిక లావాదేవీలు చాపకింద నీరులా విస్తరించాయి.
మానుకోట నేరాలకు అడ్డా..
మహబూబాబాద్‌లో అధికార పార్టీకి చెందిన యూత్ టౌన్ జనరల్ సెక్రటరీ బోగ రవిచంద్రపై హత్యాయత్నం జరిగింది. ఉదయం శంకరన్న కాలనీకి వెళ్తుండగా బీర్ సీసాలతో రవిచంద్రపై దాడి చేశారు. న్యూడెమోక్రసీ పార్టీకి చెందిన పెద్ద చంద్రన్న వర్గీయులే రవిచంద్రపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన రవిచంద్రను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. రవిచంద్రపై అటాక్ చేయడానికి ల్యాండ్ సెటిల్మెంట్లే కారణమని తెలుస్తోంది. శంకరన్న కాలనీ విషయంలో రెండ వర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్యం కోసమే ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. భూతగాదాల విషయంలోనే రవిచంద్ర న్యూడెమోక్రసీ వదిలి టీఆర్ఎస్లో చేరినట్లుగా స్థానికులు చెబుతున్నారు. బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కౌన్సిలర్ రవిని పట్టపగలు నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన జరిగి నెల రోజులు గడవక ముందే మరో నాయకుడిపై అటాక్ జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది.
పెరుగుతున్న క్రైమ్ రేట్..
మహబూబాబాద్ అడ్డగా దందాలు, సెటిల్మెంట్లే కాదు అసాంఘీక కార్యకలాపాలు, అడ్డగోలు వ్యాపారాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా గుడుంబా తయారికి నల్లబెల్లం, గంజాయి రవాణాకు ఈ ప్రాంతం కేరాఫ్ అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యం ఏదో ఒక చోట గొడవలు, ఘర్షణలు, హత్యలు జరగుతూ ఉండటంతో పోలీసులకు చేతినిండా పని ఉంటోంది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎంపీ కవిత మధ్య జరిగే కోల్డ్ వార్ని కంట్రోల్ చేయలేక పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించాల్సిన దుస్తితి కూడా తలెత్తుతోంది. రాజకీయ పార్టీల్లో ఒకే పార్టీలో తలెత్తే గొడవలను కంట్రోల్ చేయలేని పరిస్థితిని పోలీసులు ఫేస్ చేస్తున్నారు. ఈవిధంగా పట్టణంలో రాజకీయ, ఆర్ధిక పరమైన గొడవలు హత్యలకు దారి తీస్తుండటంతో స్థానిక ప్రజలు ఏ క్షణాన ఏం జరుగుతుందోన్న భయాందోళనలో గడపాల్సిన పరిస్థితి తలెత్తింది. పోలీసులు సైతం దాడికి ప్రతి దాడి జరగకుండా చూడలేక తలలు పట్టుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.