(Santhosh, News 18, Warangal)
వరంగల్ నగర శివారు, మురికివాడల్లోని ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే వారి లక్ష్యం. పిల్లలను కిడ్నాప్ చేసేందుకు ముందుగా పాఠశాల పరిసరాల్లో రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం కిడ్నాప్ చేసేందుకు కొన్ని ముఠాలు వరంగల్ నగరంలో సంచరిస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. దీనిని నిజం చేస్తూ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాల వద్ద అగంతకులు నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ కు ప్రయత్నించడం కలకలం రేపుతోంది. విద్యార్థులే తెలివిగా వ్యవహరించడంతో ఈ అపహరణ ప్రస్తుతానికి తప్పినా..మరో సందర్భంలో ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదన్న అందోళశన తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది.
ఆయా పాఠశాలల ప్రాంగణాల్లో సీసీ టీవీ కెమెరాలు లేకపోవడం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ కూడా నిఘా నేత్రాలు లేకపోవడంతోనే మురికివాడలు, శివారు ప్రభుత్వ పాఠశాలలను కిడ్నాప్ ముఠాలు ప్రత్యేకంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో సీసీ టీవీ కెమెరాలు సాధ్యమైతే పోలీసులే ఏర్పాటు చేయాలనీ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. శివనగర్‌లో ఒకే భవనంలో ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 200 మంది, ఉన్నత పాఠశాలలో 800 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో అందరికీ కలిపి రెండే టాయిలెట్స్ ఉండడం వల్ల వాటిని ఆడపిల్లలు ఉపయోగిస్తున్నారు. మగపిల్లలు బడి బయట ఉండే మోరీలో మూత్ర విసర్జన చేస్తున్నారు. ఇదే అదునుగా భావించిన అగంతకులు నవంబర్ 10వ తేదీ మధ్యాహ్న భోజన సమయంలో ఒకటి, రెండో తరగతి చదువుతున్న పిల్లలు బయటకు మూత్రం పోసేందుకు వచ్చారు. కిడ్నాపర్లు పిల్లలతో మాటలు కలిపి వారిని బలవంతంగా ఆటోలో ఎక్కించబోయారు.
ఒక్కసారిగా వారు కేకలు వేయడంతో వారు పరారయ్యారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్కడికి వచ్చింది ఎవరనేది తేలలేదు. దీనిపై అదేరోజు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. కాగా, నాలుగు రోజుల క్రితం మళ్లీ అగంతకులు వచ్చి రెక్కీ నిర్వహించడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ మార్గంలో పోలీస్ పెట్రోలింగ్ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.
మాస్క్ పెట్టుకొని వచ్చారు అగంతకులు.. ముఖానికి మాస్క్ పెట్టుకొని పల్సర్ బైక్‌పై వచ్చారు. మరొకరు ఆటోలో వచ్చారు. లంచ్ టైములో బయటకు వస్తుండగా వారిని చూసి అనుమానం రావడంతో వెంటనే అరిచాం. దగ్గరికి వస్తుంటే రాళ్లతో కొట్టాం. అంతలోనే మా సార్ రావడంతో వాళ్లు అక్కడి నుంచి పారిపోయారు. గత నెలలో కూడా ఇలానే జరిగింది. బడికి రావాలంటే బయమేస్తోందని విద్యార్థులు అంటున్నారు.
వరంగల్ నగర మురికివాడ, ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల వద్ద గస్తీ పెంచుతామని.. నిరంతరం పెట్రోలింగ్ చేస్తామని అవసరమైతే కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా అక్కడ దాతల సహకారంతో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చూస్తామని ఎక్కడేం జరిగినా క్షణాల్లో తెలిసిపోయేలా వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆందోళన చెందొద్దు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని వరంగల్ ఏసీపీ గిరికుమార్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal