మనకి తెలిసినా.. తెలియకపోయినా మనం ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అందానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. శరీర రంగు, జుట్టు ఇవన్నీ ఎలా ఉన్నా.. ఉన్న దానిలో అందంగా కనిపించాలని తపన పడుతుంటాం. మానవ శరీరానికి ఆరోగ్యంతో పాటు అందం కూడా అంతే అవసరం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు అందమంటే ముక్కు, మొహం అనే చూసేవారు. కానీ, ఇప్పుడు జనం జుట్టు, గోళ్ళ నుండి చేతులు, కాళ్లపై కూడా శ్రద్ధ చూపిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడిక్కడ పెడిక్యూర్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. అందునా వరంగల్ నగరంలో అయితే ఈ పెడిక్యూర్ కు భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
మానిక్యూర్, పెడిక్యూర్, ఫేస్ మసాజ్ ఇవన్నీ యూత్ అందానికి మెరుపు దిద్దేవే. ఇప్పటివరకు చాక్లెట్ పెడిక్యూర్ లైక్ చేసిన వరంగల్ వాసులు ఇప్పుడు కొత్తగా ఫిష్ పెడిక్యూర్ పై ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు కొందరికి మాత్రమే తెలిసిన ఈ ఫిష్ పెడిక్యూర్ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలకు పరిచయం అయింది. మామూలు పెడిక్యూర్ తో పాదాలకు ఉన్న మురికి శుభ్రం అవుతుంది. అయితే.. ఈ పెడిక్యూర్ తో ఒక్కోసారి కాళ్ల గోర్లు డామేజ్ కావడం, చర్మంపై రాషేస్ రావడంతో యూత్ చాలామంది ఈ ఫిష్ పెడిక్యూర్ ని ప్రిఫర్ చేస్తున్నారు.
ఒక రెక్టాంగులర్ గ్లాస్ ట్యాంకులో నీరు పోసి అందులో చేప పిల్లలని వదులుతారు. అందులో కాళ్ళను ఉంచడంతో కాళ్ల చుట్టూ చేపలు తిరుగుతూపాదాలపై ఉండే పగుళ్ళని, మురికిని అవి తొలగించి కాళ్ళని ఆకర్షణీయంగా మారుస్తాయి.ఈ ఫిష్ పెడిక్యూర్ కు సాధారణ చేప పిల్లలు కాకుండా నిర్వాహకులు ఇతర దేశాల నుంచి తెచ్చిన ప్రత్యేక రకం చేప పిల్లలను ఉపయోగిస్తున్నారు.
వీటిలో ఎక్కువగా గర్రరుఫా, రెడ్ ఘర్ అనే చేపలను ఉపయోగిస్తున్నారు. వీటిని డాక్టర్ ఫిష్ అని కూడా పిలుస్తారు. టర్కీతోపాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఇవి ఎక్కువగా దొరుకుతాయని ఈ పెడిక్యూర్ సెంటర్లు నిర్వహించేవారు చెప్తున్నారు. మొత్తం 15 నిమిషాలు ఈ పెడిక్యూర్ ప్రాసెస్ ఉండగా.. దీని కోసం వంద రూపాయల నుంచి 150 రూపాయల వరకు చార్జ్ చేస్తున్నారని చెప్తున్నారు. దీని ధర కూడా తక్కువగా ఉండటంతో యువత ఈ నయా పెడిక్యూర్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫిష్ పెడిక్యూర్ కాళ్లతోపాటు చేతులకు కూడా చేసుకోవచ్చని చెప్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal