Santosh, News18, Warangal
కరోనా సోకి చికిత్స నిమిత్తం వచ్చేవారికోసం వరంగల్ (Warangal) కేంద్రం ఎంజీఎం ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా (Corona), ఒమిక్రాన్ (Omicron) మళ్లీవిజృంభిస్తున్న నేపథ్యంలోఆసుపత్రిలో చికిత్స అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎంజీఎం ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆసుపత్రిలోనికరోనా వార్డులో చికిత్స అందించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించారు.డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ హెచ్ఓడి, డాక్టర్లు, టెక్నీషియన్లు ఈ మాక్ డ్రిల్ ఏర్పాటు చేశారు. సుమారు 250 పడకలతో ఉన్న ఈ కోవిడ్ వార్డులో 144 వెంటిలేటర్లను కూడా సిద్ధం చేశారు. కోవిడ్ తీవ్రతను బట్టి హాస్పిటల్లో వెయ్యి పడకలను ఉపయోగించుకునేలా ఆక్సిజన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హాస్పిటల్లో ఏ వార్డుకు వెళ్లినా ఆక్సిజన్ అందేలా ఏర్పాటు చేశామన్నారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో 20,000 లీటర్ల కెపాసిటీ గల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. కొత్తగా మరో 10 వేల లీటర్లు కెపాసిటీ గల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును ప్రభుత్వం మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఉన్న 15000 లీటర్ల కెపాసిటీ లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు ఉన్నప్పటికీ మరో 10 వేల లీటర్ల కెపాసిటీ సామర్థ్యం గల ప్లాంట్లు శాంక్షన్ అయినట్టు తెలిపారు. కొత్తగా వచ్చే ప్లాంట్లతో ఎంజీఎం కాకతీయ మెడికల్ సూపర్ స్పెషాలిటీలో సుమారుగా 60,000 లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ స్టాక్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
కరోనా తీవ్రతను బట్టి కాకతీయ మెడికల్ కాలేజీలోని 200 పడగలను కూడా వినియోగించుకునేలా ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇదివరకు లాగానే పరీక్షల కోసం ఆర్టిపిసిఆర్ చేసి, స్క్రీనింగ్ వార్డుకు తరలించి అత్యవసర పేషెంట్లకు ఆక్సిజన్ అందించే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. చికిత్సకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కొన్ని అంశాలపై కమిటీలో చర్చించామని, ఆక్సిజన్, పడకల సామర్థ్యం, వెంటిలేటర్లు, వైద్యులు, సిబ్బంది, చికిత్స, మందులు, మాస్కులపై డాక్టర్లతో, అధికారులతో సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని సూపరింటెండెంట్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Local News, Telangana, Warangal