(Pranay Diddi, News 18, Warangal)
ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో ల్యాండ్ పూలింగ్ (Land pooling) అంశం మీద రైతుల్లో నెలకొన్న భయాలు పూర్తిగా తొలగిపోలేదు. పదిరోజులపాటు రైతులు ఉద్యమాలు చేయడంతో వారి భూసేకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కాకతీయ అర్బన్ డెవలప్‍మెంట్ అథారిటీ (KUDA) చైర్మన్ ప్రకటించగా.. లాండ్ పూలింగ్ అంశాన్ని ‘టెంపరరీ హోల్డ్’లో పెట్టినట్టు వైస్‌చైర్‌పర్సన్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ‘కుడా’ చైర్మన్ మాటలకు పూర్తి భిన్నంగా KUDA వైస్ చైర్పర్సన్ ప్రకటన ఉండడంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. లాండ్‌పూలింగ్ (Land pooling) కోసం జారీ చేసిన జీఓ నంబర్ 80Aను రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు పోరాటాన్ని ప్రారంభించారు.
అభివృద్ధి చేస్తామని హామి..
'కుడా(KUDA)' ద్వారా 21,510 ఎకరాల భూములను రైతులనుంచి (From farmers) సేకరించి అభివృద్ధి చేస్తామని ఏప్రిల్ 30న ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 50 గ్రామాల్లో లాండ్ పూలింగ్ చేయనున్నట్టు, అభ్యంతరాలుంటే 30 రోజుల్లో రాతపూర్వకంగా తెలియజేయాలని సర్కారు ప్రకటించింది. రైతులు తమ భూములు లాక్కోవద్దని ఎమ్మెల్యేలకు, కలెక్టర్లకు మొరపెట్టుకోవడంతోపాటు కుడా ఆఫీసులో వినతి పత్రాలు ఇచ్చారు. అయినా కుడా వెనక్కి తగ్గకపోవడంతో రైతులు పోరుబాట పట్టారు. వరంగల్ కార్పొరేషన్, కలెక్టరేట్, కుడా ఆఫీసులను ముట్టడించారు. దీంతో టీఆర్‍ఎస్ లీడర్లు ఎక్కడకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. హరీశ్‌రావు జిల్లా టూర్ సందర్భంగా కూడా రైతులు ధర్నా (Farmers protest)చేశారు.
శాంతియుత ఆందోళనలు
జిల్లాలో రైతుల ఆందోళనలు తీవ్రం కావడంతో రాష్ట్ర సర్కారు ల్యాండ్ పూలింగ్ (Land pooling) నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ నెల 11న ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్ సుందర్‍రాజ్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను పూర్తిస్థాయిలో రద్దు చేసినట్లు ప్రకటించగా.. రైతులు సంబురపడ్డారు. రైతులకు భూసేకరణపై అవగాహన కల్పించేవరకు ఈ అంశాన్ని 'టెంపరరీగా హోల్డ్’ (Temporary Hold)లో పెట్టినట్టు కుడా వైస్ చైర్పర్సన్ ప్రావీణ్య ప్రకటించడంతో రైతులు మళ్లీ పోరాటానికి సిద్ధమయ్యారు. వారం రోజుల నుంచి రైతు సంఘాల ఆధ్వర్యంలో గ్రామాల వారీగా సమావేశాలు జరుగుతున్నాయి. ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన జీఓ 80ఏ ను శాశ్వతంగా రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు (Orders) ఇవ్వాలంటూ ఈ సమావేశాల్లో తీర్మానాలు చేస్తున్నారు.
జీవో రద్దు చేయకపోతే ఉద్యమం తీవ్రతరంచేస్తామంటున్న రైతులు
ఆరెపల్లి, కొత్తపేట, పైడిపల్లిల్లో ఆరునెలల కిందటే భూసేకరణ ప్రక్రియ రద్దు చేస్తునట్టు చెప్పినా లాండ్ పూలింగ్ జీఓ వచ్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పటివరకు వరంగల్, గీసుగొండ, ఐనవోలు, స్టేషన్ ఘన్‍పూర్ మండలాల పరిధిలోని చాలా గ్రామాల్లో మీటింగులు పెట్టి తీర్మానం చేశారు. జీఓ రద్దు చేయాలంటూ గాంధీ విగ్రహాల దగ్గర నిరసనలు తెలిపారు. జీఓను సర్కారు పూర్తిగా రద్దు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతు సంఘాల లీడర్లు అంటున్నారు.
లాండ్‌పూలింగ్ జీఓ రద్దు చేయాలి
రెండు పంటలు పండే భూములను ఇచ్చేది లేదంటూ పలు గ్రామాల్లో అన్నదాతలు రోడ్డెక్కారు. జిల్లా కలెక్టరేట్లు ముఖ్య కూడళ్లలో రాస్తోరోకోలు నిర్వహించారు. రైతుల ఆందోళనతో దిగివచ్చిన కుడా అధికారులు ల్యాండ్ పూలింగ్ నిలివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నోటిఫికేషన్ రద్దు చేస్తూ జీవో జారీ చేయకపోవడంతో వారు మరోసారి ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా ప్రజాప్రతినిధులపై తమదైన రీతిలో ఒత్తిడి పెంచుతున్నారు. ఐనవోలు మండలం పున్నేలులో అభివృద్ధి పనుల కోసం వచ్చిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ను అడ్డుకున్నారు. రింగ్ రోడ్ వల్ల జీవనాధారమైన భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐనవోలు మండలం పెరుమాండ్ల గూడెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గునేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను బాధితులు అడ్డుకోగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే కారును అడ్డుకుని మొద్దులు అడ్డుగా పెట్టి నిరసన చేపట్టారు. ల్యాండ్ పూలింగ్ పూర్తిస్థాయిలో రద్దు చేసి దళిత బందు అర్హులకు అందజేశాకే గ్రామానికి రావాలని ఎమ్మెల్యేను నిలదీశారు. ఎమ్మెల్యే గ్రామస్థుతో ఎంత వారించినా ఫలితం లేకపోవడంతో సభ పూర్తిస్థాయిలో నిర్వహించకుండానే వెళ్ళి పోయారు.
నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించినా జీవో జారీలో ఎందుకు జాప్యం చేస్తున్నారని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. ఆందోళనలు సద్దుమణిగాక మళ్లీ భూసమీకరణకు ప్రయత్నాలు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మా తాతల కాలం నుంచి భూములు ఇవి. సంవత్సరంలో రెండు, మూడు పంటలు పండుతాయి. కచ్చితంగా జీవో రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడే వరకు పోరాటం ఆపేది లేదంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers Protest, Warangal