రిపోర్టర్ : సంతోష్ కుమార్
లొకేషన్ : వరంగల్
జనరిక్ మందులు (Generic Medicines) అంటే పేద, మధ్య తరగతి ప్రజల కోసమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. చాలా తక్కువ ధరలకు ఇక్కడ మందులు లభిస్తున్నాయి. అయితే, వీటిపై అవగాహన లేకపోవడంతో సేల్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ దొరికే మందులు మంచివి కాదని, డూప్లికేట్ మందులని ప్రచారం చేస్తుంటారు. దీంతో ప్రజలు జనరిక్ షాపులలో మందుల వైపు మొగ్గుచూపకపోవడంతో దుకాణాలు కూడా పరిమిత సంఖ్యలోనే ఉంటున్నాయి. అందుకే, వీటిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించి.. షాపుల ఏర్పాటుకు సహకారం అందిస్తోంది. వీటి ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలని సరికొత్త అడుగులు వేస్తుంది.
స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు స్త్రీ నిధి ద్వారా జనరిక్ మందుల దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అందుకోసం రుణాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల రుణం ఇవ్వనుంది. ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా అర్హులకు అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ రుణాల మంజూరుకు శ్రీనిధి నిబంధనలు కూడా సడలించారు. ఆసక్తి, అవగాహన ఉన్న మహిళా సంఘాల్లోని కుటుంబ సభ్యులు, బంధువులు ముందుకు రావాలని అధికారులు కోరుతున్నారు.
దేశంలో జనరిక్ మందులకు ఆదరణ పెరుగుతుంది. రాష్ట్రంలో ప్రజలకు సరైన అవగాహన లేక పలు అనుమానాలు ఉండటంతో పూర్తిస్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఈ మందులపై ప్రజల్లో అవగాహన పెంచడంతో మహిళలకు ఉపాధి కల్పించే విధంగా దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. ఈ విషయమై అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలి. మహిళా సంఘాలకు అవగాహన కల్పించడంతో పాటు ఉపాధి ఏ విధంగా ఉంటుందో వివరించాలి. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేవలం 100 దుకాణాలు మాత్రమే ఉన్నాయి. అందుకే, మహిళా సంఘాల్లో సభ్యులు మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు సభ్యులకు రుణాలు అందిస్తారు. అయితే, తప్పనిసరిగా డి ఫామ్, ఎం ఫామ్, బి ఫార్మసీ ధ్రువీకరణ పత్రాలు కలిగి ఉండాలి. షాపు ఏర్పాటు చేసుకునే వారు కనీసం 120 గజాల స్థలాన్ని చూపించాలి. ఇప్పటికే అల్లోపతి మెడికల్ దుకాణాలు ఉంటే.. దానికి అదనంగా జనరిక్ మెడికల్ షాపు ఏర్పాటు రుణం పొందవచ్చు. తర్వాత ఆసక్తి ఉన్న వారందరికీ రుణాలు అందజేస్తారు.
కాగా, ఇప్పటివరకు స్వయం సహాయక పథకంలో ఉపాధి పొందిన వారిలో వరంగల్ పాపయ్యపేటకు చెందిన రంజిత్ కుమార్ ఒక్కరే ఉన్నారు. రంజిత్ కుమార్ గత 20 సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్ లో ఉంటూ ఒక మెడికల్ షాప్ లో 20 సంవత్సరాలుగా గుమాస్తాగా పని చేశాడు. తనకంటూ సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఈ జనరిక్ మెడికల్ షాపును ప్రారంభించాడు. అయితే సామాన్య ప్రజలకు ఈ జెనరిక్ మెడికల్ పై అవగాహన లేకపోవడంతో మందులపై అనుమానాలు ఉండటంతో వీటిని కొనుగోలు చేయడం లేదని అంటున్నారు. జనరల్ మెడికల్ షాపుల్లో దొరికే మందులు, జనరిక్ మెడికల్ షాపుల్లో దొరికే మందులు ఒక్కటేనని.. ఏమాత్రం తేడా ఉండదని, కేవలం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా లభించే ఈ మందుల్లో ధరలు మాత్రమే తక్కువగా ఉంటాయని చెప్పారు. దీని కోసం ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Medical shop, Telangana, Warangal