రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
ఫేస్బుక్, ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ ఇందులో అయినా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చిందంటే మాత్రం యాక్సెప్ట్ చేయొద్దు. చేశారంటే మాత్రం మీతో పరిచయం పెంచుకొని మీ వివరాలు తెలుసుకొని ఆ తర్వాత వాట్స్అప్లో శృంగార సంభాషణ జరుపుతారు. ఆ తర్వాత అమ్మాయిలతో వీడియో కాల్స్ చేయిస్తారు. వీడియో కాల్స్ లో రెచ్చగొట్టే విధంగా శృంగార సంభాషణ నడుపుతారు. రెండు మూడు రోజుల్లోనే న్యూడ్ కాల్స్ చేసుకునే విధంగా ట్రాప్ చేస్తారు. ఆ తర్వాత పరువు తీస్తామంటూ బ్లాక్మెయిల్ చేస్తారు. మీతో మాట్లాడిన శృంగారపు సంభాషణ ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కి షేర్ చేస్తామంటూ బెదిరిస్తారు. బాధితుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇలాంటి న్యూడ్ కాల్స్ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి.
చివరకు బాధితులు ఫిర్యాదు చేస్తే పరువు పోతుందని, ఎలా ఫిర్యాదు చేయాలో తెలియక కొంతమంది బాధితులు డబ్బులు కూడా పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. అంతే కాకుండా మరికొంతమంది మానసికంగా కృంగి కృషించిపోతున్నారు. ఎన్నో సంఘటనలు జరుగుతున్నా బాధితులకు ధైర్యం చాలక, పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని సతమతమవుతూ కొంతమంది ఉన్నారు.
ముందుగా కొన్ని సోషల్ మీడియా ఎకౌంట్లో టార్గెట్ చేసిన వ్యక్తులను ఎంచుకొని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లో చేరుతారు. బాధితుల వ్యక్తిగత వివరాలను తెలుసుకుంటారు.. టార్గెట్ చేయాలన్న వ్యక్తుల కాంటాక్ట్ నెంబర్, బంధుమిత్రుల వివరాలను తెలుసుకుంటారు. వివరాలను సోషల్ మీడియాలో రిక్వెస్ట్ చేస్తూ ఆకర్షించే విధంగా ఫోటోలను, పోస్టులను పెడుతూ ఉంటారు. అయితే ఈ వలలో పడ్డవారు పని అంతే.
ముందుగా ఫేస్బుక్ చాటింగ్ తో మొదలుపెట్టి వివరాలు తెలుసుకొని వాట్సాప్ చాటింగ్ చేయమని నెంబర్ షేర్ చేస్తారు. వాట్సప్ కాల్ లో వీడియో కాల్ చేసుకుని మాట్లాడుకునేలా ట్రాప్ చేస్తారు. రోజుల వ్యవధిలోనే బాధితులకు నమ్మకం కుదిరేలా చేసి అమ్మాయిలతో న్యూడ్ కాల్స్ చేయించి బాధితులను ట్రాప్ చేస్తారు. బాధితుడు కూడా వీడియో కాల్ లో బట్టలు విప్పి చూపించేలా ట్రాప్ చేస్తారు. దీంతో కొంతమంది చెప్పినట్లుగా చేయడంతో సైబర్ నేరగాళ్లకు అడ్డంగా బుక్ అవుతున్నారు. బాధితుల వీడియో చాటింగ్ దృశ్యాలను స్క్రీన్ రికార్డు చేసి కాల్ ముగిసిన అనంతరం తిరిగి బాధితులకు వారి న్యూడ్ వీడియోలను పంపించి ఫేస్బుక్, ట్విట్టర్లలో అప్లోడ్ చేస్తామంటూ డబ్బులు లాగుతుంటారు. దీంతో సైబర్ నెరగాళ్లు అడిగినంత డబ్బులను అందిస్తున్నారు.
ఇలా అమాయకంగా చేసిన తెలివి తక్కువ పనికి మానసికంగా కృంగిపోతున్నారు. మరి కొంతమంది అయితే ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ పోలీస్ కంప్లైంట్స్ చేయకపోవడం విశేషం. అయితే ఏవైనా అపరిచిత వ్యక్తులు కానీ, సోషల్ మీడియా నెట్వర్క్లలో రిక్వెస్ట్ పంపిస్తే అంగీకరించవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా వచ్చి పోలీసులకు తెలపాల్సిందిగా నగర పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CYBER FRAUD, Local News, Telangana, Warangal