Santosh, News18, Warangal
ముందుచూపు లేకపోవడమో లేక ప్రజల సొమ్మే కదా మాదేం పోద్దిలే అనుకుంటారో కానీ.. ఒక్కోసారి మన ప్రభుత్వ అధికారులు అనాలోచిత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వ ఖజానాలను గుల్ల చేస్తుంటారు. ఇలాంటివి ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు, రోడ్ల నిర్మాణం సమయంలో చూస్తుంటాం. ముందు ఒక ప్లాన్ ప్రకారం కట్టేసి.. ఆ తర్వాత నాలిక్కరుచుకొని అబ్బే ఇలా కాదని.. కట్టింది పడేసి.. మళ్ళీ కొత్తగా నిర్మాణం మొదలు పెడుతుంటారు. ఇదిగో వరంగల్ (Warangal) నగరంలో రోడ్ల పరిస్థితి కూడా అలాగే కనిపిస్తుంది. వరంగల్ నగరంలో ఈ మధ్య స్మార్ట్ సిటీ పథకం కింద కొత్తగా రోడ్లని నిర్మించారు. ఈ రోడ్లు నిర్మాణం పూర్తయి రోజులు కూడా గడవలేదు కానీ.. అప్పుడే జేసీబీలు, మిషన్లతో రోడ్ల మధ్యన డివైడర్ ను పడగొట్టేస్తున్నారు అధికారులు.
ఇది చూసిన నగర ప్రజలు కట్టుదెందుకు.. మళ్ళీ కూల్చుడేందుకు సారూ అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే, సమాధానం చెప్పేదెవరు?. కూల్చివేతలు నిర్వహిస్తున్న వారు మాత్రం మాదేముంది సారూ.. పై అధికారులు చెప్పారు.. మేం చేస్తున్నాం అని చెప్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. వరంగల్ నగరంలో ఈ మధ్యనే రూ.72 కోట్లతో స్మార్ట్ సిటీ రహదారులను నిర్మించారు. పోచమ్మ మైదాన్ నుంచి జేపీఎన్ రోడ్డు వరకు ఉన్న రోడ్డు కూడా అందులో ఒకటి. అయితే, ఉన్నట్లుండి మూడు నాలుగు రోజులుగా రాత్రి సమయంలో జేసీబీలు పెట్టి రోడ్డు మధ్యన ఉన్న డివైడర్ ను తొలగిస్తున్నారు. అది కూడా రాత్రి సమయంలో తొలగించడం.. ఉదయానికి శిధిలాలు కూడా కనిపించకుండా చేస్తున్నారు. దీనిపై కొంతమంది నగర ప్రజలు ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పడం లేదు.
అయితే, కొందరు వ్యాపారులకు ఈ డివైడర్ లు అనుకూలంగా లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా లక్షలలో ప్రజాధనం వృథా అయినట్లు తెలుస్తుంది. కాగా, వరంగల్ నగరంలో ఇలాంటివి కొత్తేమీ కాదు. గతంలో వరంగల్లో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ విషయంలో కూడా యథేచ్ఛగా డిజైన్లు మార్చేశారు. హనుమకొండలోని నిట్ క్యాంపస్ నుంచి సుబేదారి వరకు రూ.1.30 కోట్లతో సైకిల్ ట్రాక్ సైతం సైకిళ్ల రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేకుండా నిర్మించగా.. దాన్ని స్థానిక వ్యాపారులు ఎవరికి వారు ఇష్టారీతిన కూల్చేసి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ గా మార్చేసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal