Santosh, News18, Warangal
ఎన్నో ఆశలతో బతుకు పోరాటం మొదలు పెట్టారు. చేసేందుకు పని దొరకలేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. చుట్టూ ఆర్థిక కష్టాలు అలుముకున్నాయి. ఇక చావే పరిష్కారమనుకున్నారు. ఆభరణాలు మెరుగుపెట్టే సైనేడ్ ను భార్యాభర్తలిద్దరూ గుండెనిండా దుఃఖంతో తాగారు. ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇద్దరు పిల్లలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లి, తండ్రులను ఒంటరి చేశారు. దంపతుల బలవన్మరణంతో వరంగల్ (Wawangal) జిల్లా కేంద్రంలోని గిర్మాజీపేటలో విషాద ఛాయలు నెలకొన్నాయి. వరంగల్ నగరంలో ఎంతోమంది స్వర్ణకారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉపాధి పొందుతుంటారు. విశ్వకర్మ వీధిలో బంగారు ఆభరణాలు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. ఇలానే తన జీవితాన్ని బంగారుమయం చేసుకుందామని జగిత్యాల జిల్లాకు చెందిన ఉప్పల సతీష్, భార్య స్రవంతితో కలిసి నగరానికి వచ్చాడు.
బంగారు పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు విరాట్, విహార్ ఉన్నారు. కరోనా తరువాత అంతో ఇంతో కోలుకున్నా... రానురాను పని దొరకడం కష్టమైంది. కుటుంబ పోషణ భారమై... ఇటీవలి కాలంలో పని దొరకడం లేదు. చేతిలో డబ్బులు ఉండడం లేదు. ఇంట్లో వృద్ధాప్యంలో కాలు విరిగిన ఉన్న నాన్న, అమ్మ, భార్య, ఇద్దరు పిల్లలు కుటుంబ పోషణ కష్టమైంది. తెలిసిన వారి దగ్గర, ప్రైవేట్ ఫైనాన్స్‌లలో అప్పు తెచ్చి బతుకు బండిని నెట్టుకొచ్చాడు. అప్పులిచ్చిన వాళ్లు తిరిగి చెల్లించాలని అడగడం మొదలెట్టారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దైన్యం. దంపతులకు రూ.10లక్షల నుంచి రూ.20లక్షల వరకు అప్పు ఉన్నట్లు తెలిసింది.
అప్పులు తీర్చేదారి కనిపించక సతీష్ మానసికంగా కుంగిపోయాడు. రోజూ భార్యతో చెబుతూ బాధపడేవాడు. నాలుగు రోజుల క్రితం తన తండ్రి మోహన్‌తో తన గోస చెప్పి చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేయగా ఏమీ కాదు అన్ని సర్దుకుంటాయని తండ్రి మనోధైర్యం కల్పించారు. అయినా అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది.
ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్న దంపతులు రాత్రి చిన్న కుమారుడు నానమ్మ తాతయ్య దగ్గర ఆడుకుంటుండగా... పెద్దకుమారుడు విరాట్ ను తీసుకుని బెడ్రూంలోకి వెళ్లారు. బంగారం, వెండి ఆభరణాలకు మెరుగుపెట్టే సైనేడ్ ను వాటర్ బాటిళ్లలో కలుపుకుని భార్యాభర్తలిద్దరూ తాగారు. దేవడి తీర్థంరా.. తాగు అంటూ పెద్దకుమారుడికి నోట్లో పోశారు. వెంటనే బాలుడు బయటికి ఉమ్మి వేశాడు. దీంతో బాలుడు ప్రాణాలతో బయటపడగా దంపతులిద్దరూ చనిపోయారు.
చేతికొచ్చిన కొడుకు తమను పోషిస్తాడని భావించిన తండ్రి.. ఆ కొడుకు కన్న పిల్లల బాధ్యత చూడాల్సి రావడంతో కన్నరు మున్నీరుగా విలపించారు.“కొడుకా... ఇంత పనిచేస్తావనుకోలేదు' అంటూ ఆవృద్ధ దంపతులు రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. స్వర్ణకారులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో వరంగల్ గిర్మాజీపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal