తెలంగాణ (Telangana)లో అధికార పార్టీ (TRS)పై ప్రజా వ్యతిరేకత ఉందని స్పష్టమవుతున్నా దాన్ని చేజిక్కించుకోవడంలో విఫలమవుతున్నారు కాంగ్రెస్ నేతలు (T Congress Leaders). ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఎన్నికల్లో అవకాశాలున్నాయని భావిస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Congress Leader Rahul Gandhi) రాష్ట్రంలో పార్టీని పట్టాల మీదకు తెచ్చేందుకు నడుం బిగించడం పట్ల పార్టీలో సంతోషం వ్యక్తమవుతోంది. నిజానికి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంక్ వుంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్కు గత వైభవమే లక్ష్యంగా శ్రేణులకు మార్గనిర్దేశం చేయడానికి నడుం బిగించారు రాహుల్. మే 6న తెలంగాణ పర్యటన సైతం ఖరారయింది. ఇందుకోసం వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. అయితే రాహుల్ (rahul gandhi) వరంగల్ పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. వరంగల్లో ర్యాలీ నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రాహుల్ గాంధీ ర్యాలీ..
మే 6న మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి వరంగల్ (Warangal)కు హెలికాఫ్టర్లో వస్తారు రాహుల్ గాంధీ. కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University)కి చేరుకుని .. అక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు రాహుల్ గాంధీ ర్యాలీ ఏర్పాటు చేశారు. ఓపెన్ టాప్ వ్యానులో రాహుల్ ర్యాలీ (Rahul gandhi rally) చేపడతారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు రాహుల్ బహిరంగ సభ వుంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
రైతు సంఘర్షణ సభగా నామకరణం..
ఈ సభకు రైతు సంఘర్షణ సభగా నామకరణం చేశారు కాంగ్రెస్ నేతలు. ఓరుగల్లు సభతో రాష్ట్ర రాజకీయాల్లో వైబ్రేషన్స్ ఖాయమని చెబుతున్నారు టీపీసీసీ నేతలు. మరోవైపు ఇప్పట్నుంచే రాహుల్ సభ కోసం సన్నాహాలు చేస్తున్నారు కాంగ్రెస్ ముఖ్య నేతలు.. బహిరంగ సభా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా రైతులు ఈ బహిరంగ సభకు తరలివస్తారనే అంచనాతో ఉన్న కాంగ్రెస్.. దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో పడింది.
అయితే రాహుల్ తెలంగాణ పర్యటన రెండు వైపులా కలిసొచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలు విశ్లేసిస్తున్నాయి. పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని ఇప్పటికే సైలెంట్ చేసిన రాహుల్.. ఇప్పుడు రాష్ట్రానికి వస్తే క్షేత్రస్థాయి అంశాలన్నీ మరింత సద్దుమణుగుతాయని భావిస్తున్నారు. ఇప్పటికీ వేర్వేరుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర సీనియర్లు రాహుల్ సభ నేపథ్యంలో కలిసి వస్తారని, రాష్ట్రంలో ఆయా వర్గాలను తమవైపు తిప్పుకునే అవకాశం సైతం లభిస్తుందని టీపీసీసీ ఆశిస్తోంది.
రాహుల్ పర్యటన నేపథ్యంలో అటు పార్టీ వ్యూహకర్త సునీల్ గ్రౌండ్ రిపోర్టు రెడీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లను ప్రకటించినా.. ఇంకా నిరుద్యోగుల్లో అసంతృప్తి వస్తూనే ఉండటంతో నిరుద్యోగ యువతే లక్ష్యంగా రాహుల్ సమావేశం నిర్వహించనున్నారు. మొన్నటిదాకా ధాన్యం కొనుగోళ్లపై జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Revanth Reddy, TS Congress, Warangal