ఏ కష్టం వచ్చిందో ఏమో..! ఓ ఆర్టీసీ కండక్టర్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. తాను డ్యూటీ చేసిన బస్సులో బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి తొర్రూరు ఆర్టీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా డ్యూటీకి వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో సెక్యూరిటీ రిజిస్టర్‌లో సంతకం పెట్టి.. డిపో లోపోలికి వెళ్లాడు. లోపలికి వెళ్లిన మహేందర్ రెడ్డి.. ఎంత సేపటికీ బయటకు రాలేదు. సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది.. డిపో అంతటా వెతికారు. చివరకు ఓ బస్సులో విగత జీవిగా కనిపించాడు మహేందర్ రెడ్డి.
సమాచారం అందుకున్న డిపో అధికారులు.. కండక్టర్ ఆత్మహత్య విషయాన్ని వెంటనే పోలీసులకు చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐతే మహేందర్రెడ్డి ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు? అనే వివరాలు తెలియరాలేదు. వ్యక్తిగత కారణాలా? పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఏవైనా గొడవలు జరిగాయా? అని కుటుంబ సభ్యులను కూడా ప్రశ్నించారు.
కండక్టర్ మరణంతో కంఠాయపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆర్టీసీ అధికారుల పని ఒత్తిడి వల్లే మహేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mahabubabad, Telangana