హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: శిథిలావస్థలో శతాబ్దాల నాటి ఆలయం .. పురాతన దేవాలయానికి పూర్వ వైభవం ఎలా వచ్చిందంటే

Telangana: శిథిలావస్థలో శతాబ్దాల నాటి ఆలయం .. పురాతన దేవాలయానికి పూర్వ వైభవం ఎలా వచ్చిందంటే

(పురాతన గుడికి పూర్వ వైభవం)

(పురాతన గుడికి పూర్వ వైభవం)

Warangal:కాకతీయుల నాటి అద్భుత కట్టడాలెన్నో కనుమరుగవుతున్నాయి. వందలు, వేల ఏళ్లనాటి గుళ్లు నిరాదరణకు గురవుతున్నాయి. వాటిలో ఒకటే ముప్పారంలోని త్రికూటాలయం. కానీ ఒక యువకుడు ఆ ఆలయపునరుద్ధరణకు నడుం బిగించాడు. అతనికి తోడు ఊరంతా కదిలొచ్చింది.

ఇంకా చదవండి ...

(D.Pranay,News18, warangal)

రాణి రుద్రమదేవి పాలించిన కాకతీయ సామ్రాజ్యంలోని ఓరుగల్లు అంటేనే ఎన్నో పుణ్యకేత్రాలకు నెలవు. అందులో నిత్యం పూజలందుకునే దేవాలయాలు కొన్నైతే.. దూప,దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. క్రీస్తుపూర్వం 11వ శతాబ్దంలో వరంగల్ (Warangal)జిల్లాలోనే అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కాలక్రమేణా అందులో కొన్ని దేవాలయాలు కనుమరుగయ్యాయి. కాకతీయ సామ్రాజ్యం(Kakatiya Empire)లో ఓ వెలుగు వెలిగింది ఓరుగల్లు ప్రాంతం. పుణ్యక్షేత్రాలు, చెరువులు, కళలు ఇలా అన్నింటా అభివృద్దే. కాకతీయుల కాలంలో ముఖ్యంగా ఆలయాలకు ఎక్కువప్రాధాన్యత ఉండేది. ఆనాటి ఆలయాల శిల్పకళలు ఇప్పటికీ ఔరా అనిపించేలా ఉంటాయి. అందులో ఒకటే హనుమకొండ (Hanumakonda)  జిల్లా ధర్మసాగర్(Dharmasagar)మండలం ముప్పారం (Mupparam)లోని నాద త్రికూట దేవాలయం.

త్రికూట దేవాలయం అని పేరు ఎలా వచ్చింది..?

చుట్టూరా పచ్చని ప్రకృతి పక్కనే గలగలపారే గంగమ్మ…ఆ గంగమ్మ ఒడ్డుని ఆనుకొని ఉన్న ఆలయమే నాద త్రికూట దేవాలయం. క్రీస్తు పూర్వం 1100 శతాబ్దంలో అప్పటి కాకతీయ నిర్మాణాల్లో ఒకటి ఈ శ్రీముఖ్య నాద త్రికూట దేవాలయం. ఇంతకీ ఈ ఆలయానికి త్రికూట దేవాలయం అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఈ ఆలయాన్ని ఎటువైపు నుంచి చూసినా త్రికూటమిలా కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఈ ఆలయాన్ని త్రికూట దేవాలయం అని పిలుస్తారు.

నిధులకు ఆశపడి ఆలయ ధ్వంసం..

పూర్వం ఈ ఆలయంలో ఏదో నిధి ఉందని కొందరు ఆకతాయిలు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని, శివుడి వాహనమైన నందిని ధ్వంసం చేశారు. అప్పటినుండి ఈ ఆలయం శిధిలావస్థలో ఉంది. అయితే ఈ ఆలయంలో శివుడితో పాటు పార్వతీదేవి, గణపతి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు కొలువై ఉండేవారని ఈ ప్రాంత వాసులు చెబుతుంటారు.

ఒక్కడిగా కదిలాడు..ఊరంతా కదిలివచ్చింది..

పూర్వం నిత్యం దూప,దీప నైవేద్యాలందుకున్న ఈ ఆలయం ప్రస్తుతం చరిత్రకు సాక్ష్యంగా మిగిలిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం మరుగున పడిపోకూడదన్న ఆలోచనతో శివసాని ప్రవీణ్ రవీంద్ర అనే ఓ యువకుడు ఆలయ అభివృద్ధికి నడుం కట్టాడు. జిల్లాకి చెందిన వారసత్వ సంపదను ధ్వంసం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదేనని భావించాడు. ఒక్కడిగా వచ్చి ఆలయాన్ని శుభ్రం చేయడంతో ..అతని వెంట ఊరంతా కలిసివచ్చింది. గ్రామస్తులే కాదు..చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు సైతం నాద త్రికూట దేవాలయాన్ని దర్శించుకునేందుకు వస్తున్నారు.

శిథిలావస్థలోని ఆలయానికి పూర్వవైభవం..

శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని శివరాత్రి పర్వదినాన ఈ ఆలయంలో శివుని ప్రతిష్టించాలని నిర్ణయించారు గ్రామస్తులు. ఆ సమయంలోనే ఆలయ ప్రాంగణంలో ఉన్న పుట్ట మట్టితో శివలింగాన్ని తయారుచేసి గుళ్లో ప్రతిష్టించాలనుకున్నారు. మట్టి కోసం ఆ పుట్టని తవ్వేందుకు వెళ్లినవాళ్లంతా అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఆ పుట్టలో నుండి శివలింగం వెలుగుచూడటంతో అంతా భగవత్‌ సంకల్పంగా భావించారు. ఆ శివలింగాన్ని ఆలయంలో ప్రతిష్టించి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు.

ఏ మేరకు పునరుద్ధరణ పనులు..?

ముప్పారం గ్రామంలోని కాకతీయుల కాలంనాటి నాద త్రికూట ఆలయాన్ని పరిరక్షించేందుకు పునరుద్ధరణ పనులను చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కూడా కోరారు. ఆలయం పునరుద్ధరణ పనులను సమన్వయం చేసుకోవాలని పురావస్తు శాఖకు ప్రభుత్వం సూచించింది. మరి ఆ పునురుద్ధరణ పనులు ఏ మేరకు వచ్చాయో ఈశ్వరుడికే తెలియాలి అంటున్నారు స్థానికులు.


మరెన్నో మరుగున పడ్డ ఆలయాలు..

ఉమ్మడి వరంగల్‌ ప్రాంతంలో కాకతీయుల సామ్రాజ్యంలో ఎందరో రాజులు కట్టించిన ఆలయాలు, చారిత్రక నిర్మాణాలు ఇప్పటికి దర్శనమిస్తుంటాయి. కేవలం వాటికి ఎలాంటి రక్షణ లేకపోవడంతో చారిత్రక సంపద కాస్తా శిథిలావస్థకు చేరుకుంటోంది. చరిత్రకు గుర్తుగా ఉండే ఇలాంటి ప్రాచీన కట్టడాలపై కేంద్ర పురావస్తుశాఖ, రాష్ట్ర పురావస్తు శాఖ దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. మన దేశంలో కట్టడాలను పోలిన కొన్ని ఆలయాలు విదేశాల్లో ఉన్నాయి. వాటిని అక్కడి ప్రభుత్వాలు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాయి. చారిత్రక కట్టడాలను రక్షిస్తూ వారి ప్రాచీన సంపదను కాపాడుకుంటున్నాయి. కానీ ఇక్కడ ఎన్నో చారిత్రక ప్రదేశాలు కనుమరుగవుతున్నా…ప్రభుత్వాలు కన్నెత్తి చూడట్లేదని చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Hindu Temples, Telangana, WARANGAL DISTRICT

ఉత్తమ కథలు