తెలంగాణలో 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ (Congress party) పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ (TRS) ను గద్దె దించడం కోసం అవసరమైన వ్యూహాంతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. ఇందులో భాగంగా తెలంగాణకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ (MP Rahul Gandhi)ని రప్పించాలని డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. ఈ నేపథ్యంలో రాహుల్ తెలంగాణ పర్యటన తేదీలు(Rahul gandhi Telangana tour) ఖరారయ్యాయి. మే 4, 5 తేదీల మధ్య రెండు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేందుకు ఏఐసీసీ కార్యాలయ వర్గాల నుంచి ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మే 4న వరంగల్ ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో నిర్వహించే 'రైతు బహిరంగసభ'కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
టీపీసీసీ నాయకులతో భేటీ..
ఈ సభ తర్వాతి రోజున రాహుల్‌గాంధీ ఒకరోజు హైదరాబాద్ (Hyderabad)లో ఉండనున్నారు. మే 5న బోయినపల్లిలో కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. ఆ తర్వాత గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం ఉండే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో కూడా సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
మారిన షెడ్యూల్..
గతంలో ప్రకటించిన షెడ్యూల్ లో ఈ నెల 28న వరంగల్ లో జరిగే సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఏప్రిల్ 29న హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే గతంలో ప్రకటించిన షెడ్యూల్ పూర్తిగా మారింది. మే 4,5 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
గత రెండు టర్మ్ లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ఫణంగా పెట్టి తెలంగాణ ఇచ్చినా కూడా అధికారానికి దూరం కావడం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి రాజకీయంగా నష్టం వాటిల్లింది. అయితే ఈ దఫా మాత్రం రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ ఎన్నికల వ్యూహాకర్తగా నియమించుకున్న సునీల్ వ్యూహాలకు అనుగుణంగా రాష్ట్రంలో కార్యక్రమాలను చేపట్టనున్నారు.
కాంగ్రెస్ ఎంతగా బలపడాలని చూస్తున్న అంతకు రెండింతలు బీజేపీ దూసుకెళుతోంది. టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ రేసులో ముందుకు వచ్చింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బీజేపీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్ ను ఢీకొట్టే సత్తా ఉందని నిరూపించిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంప గుత్తగా వెళ్లే అవకాశాలూ లేకపోలేదు. అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టే సామర్థ్యం తమకే ఉందని ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు గాను కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుండే ప్రయత్నాలు ప్రారంభించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Telangana, TS Congress, Warangal