రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
మిర్చి పంట దిగుబడి రాక అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య పాల్పడిన ఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా రోటిబండ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండాకు చెందిన అజ్మీర రవీందర్ కు 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గత ఏడాది మిర్చి పంట సాగు చేశాడు. పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో రెండు లక్షల అప్పు అయ్యింది. మళ్ళీ ఈ ఏడాది సైతం మిర్చి సాగు చేయగా మరో రెండు లక్షలు అప్పు అయ్యింది. అదేవిధంగా 8 లక్షల రూపాయలు అప్పుచేసి డోజర్ కొనుగోలు చేశాడు. దానికి పనులు లేకపోవడంతో అప్పు పెరిగిపోయింది.
మొత్తం అప్పు 12 లక్షలకు చేరింది. అప్పు ఎలా తీర్చాలో తెలియక.. ఒత్తిడి పెరిగి రవీందర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, బంధువులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
నా భర్త మృతిపై అనుమానం ఉందని అంటున్న పాస్టర్ భార్య మరియమ్మ..
నెక్కొండ సిఎస్ఐ చర్చ్ ఫాస్టర్ బుల్లి తిమోతిది ఆత్మహత్య కాదని అనుమానాస్పదంగా ఉందని మృతుడి భార్య మరియమ్మ ఆరోపించారు. చర్చ్ ఆవరణలో గత నెల 13వ తారీఖున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని భర్త మృతి చెందాడని ముందుగా భావించామన్నారు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉండగా కొందరు వ్యక్తులు తన చేత ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయించారని ఆమె కన్నీరు మున్నీరయ్యారు.
పాస్టర్ ఆత్మహత్యకు పాల్పడలేదని, గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉరివేసుకున్నట్లు లుంగీతో ఇంట్లో దూలానికి వేలాడదీశారని ఆమె ఆరోపించారు. తిమోతి చాతి మీద గాయాలు ఉన్నాయని, ఉరివేసుకున్నట్లు ఎలాంటి ఆనవాళ్లు లేకపోవడంతోనే పలు అనుమానాలు ఉన్నాయన్నారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడే పిరికివాడు కాదన్నారు. మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. తన భర్త మృతికి కారణమైన వారిపై విచారణ చేసి న్యాయం చేయాలని మరియమ్మ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal