రిపోర్టర్ : సంతోష్
లొకేషన్ : వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా చెన్నారావుపేట (Chennarao Peta) మండలంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కళ్లు గప్పి పోలీస్ స్టేషన్లో ఉన్న బైక్ తో యువకుడు పరారైన ఘటన చెన్నారావుపేట (Chennarao Peta) మండలం అక్కల్చెడ గ్రామంలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
గణేష్, మధు అనే యువకులు హైదరాబాద్ (Hyderabad) లో ఒకే చోట పని చేస్తుండేవారు. సంక్రాంతి పండుగ సందర్బంగా గణేష్ ఇంటికి మధు అనే యువకుడు వచ్చాడు. ఈ ఇద్దరితో పాటు గ్రామానికి చెందిన కొంతమంది యువకులు కలిసి చెన్నారావుపేట శివారులోని ఓ కాలనీకి చెందిన కిరాణ షాపు వద్దకి వచ్చారు.
ఇక అదే సమయంలో కిరాణ షాపు వద్దకు రాజస్థాన్ కి చెందిన కొంతమంది యువకులు వచ్చారు. ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. దీనితో రెండు వర్గాలు కొట్టుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చే సరికి గ్రామానికి చెందిన యువకులు ద్విచక్ర వాహనం అక్కడ వదిలి పరారయ్యారు. దాంతో ఆ వాహనాన్ని పోలీసులు స్టేషన్ కు తరలించారు.
అయితే మధ్యాహ్నం పోలీస్ స్టేషన్లో ఉన్న తన ద్విచక్ర వాహనాన్ని పోలీసుల కళ్ళు కప్పి మధు అనే యువకుడు తీసుకొని పరారయ్యాడు. దీనిని కానిస్టేబుల్ గమనించి బైక్ ను పోలీస్ వాహనంతో వెంబడించగా..చెన్నారావుపేట శివారుకు రాగానే పోలీసు వాహనంలో డీజిల్ అయిపోయింది. దీంతో వాహనం పక్కనపెట్టి ద్విచక్ర వాహనం ద్వారా మధు కోసం వెంబడించారు.
అయినా ఆ యువకుడు దొరకపోవడంతో కానిస్టేబుల్ ఉసూరుమంటూ స్టేషన్ కు తిరిగివచ్చారు. స్టేషన్ నుండే బైక్ దొంగిలించిన యువకుడు పోలీసులకు దొరకకుండా చుక్కలు చూపించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bike, Local News, Police station, Telangana, Warangal