హోమ్ /వార్తలు /తెలంగాణ /

Warangal: ఆ ఊరి శ్మశానంలోనే వైద్యకేంద్రం.. అటు చితి కాలుతుండగానే ఇటు రోగులకు వైద్యం.. వివరాలివే..

Warangal: ఆ ఊరి శ్మశానంలోనే వైద్యకేంద్రం.. అటు చితి కాలుతుండగానే ఇటు రోగులకు వైద్యం.. వివరాలివే..

వైద్య కేంద్రం

వైద్య కేంద్రం

వైద్య కేంద్రం (Medical center).. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వైద్యం చేసేది. శ్మశానం (Cemetery).. చనిపోతే కాల్చేది.. పూడ్చేది ఇక్కడే. మరి ఏకంగా బతికించే వైద్యశాలను శ్మశానంలో నిర్మిస్తే.. సరిగ్గా అలాంటిదే ఇక్కడ జరిగింది.

(G. Srinivas Reddy, News 18, Khammam)

వైద్య కేంద్రం (Medical center).. ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే వైద్యం చేసేది. సరైన చికిత్స చేసి క్షేమంగా ఇంటికి పంపేది. ఇక్కడ వైద్యులు దేవుడితో సమానం. శ్మశానం (Cemetery).. చనిపోతే కాల్చేది.. పూడ్చేది ఇక్కడే. మరి ఏకంగా బతికించే వైద్యశాలను శ్మశానంలో నిర్మిస్తే.. సరిగ్గా అలాంటిదే ఇక్కడ జరిగింది. ఊరి జనం వైద్య కోసం వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఉన్న ఈ గ్రామం పేరు తాళ్లపూసపల్లి (Tallapoosapalli). కేసముద్రం (Kesamudram) మండలం మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా. ఇక్కడ సమాధుల మధ్యే ఈ ప్రాథమిక వైద్య ఉపకేంద్రం నిర్మించారు. ఇంకేముంది అక్కడ పనిచేయాల్సిన సిబ్బంది.. వైద్యం అవసరమైన ప్రజలు వైద్యశాలకు పోవాలంటేనే వణికిపోతున్నారు. కొన్నిసార్లు పక్కనే శవాలను కాల్చుతుంటారు.. మరో పక్కనే వైద్యం (Treatment) చేస్తుంటారు.  ఒక్కసారి అక్కడకు వెళ్లిన వాళ్లు ఇంకెప్పుడూ వెళ్లాలనుకునే పరిస్థితి లేదు. దీంతో లక్షల ఖర్చుతో నిర్మించిన వైద్యశాలను ఉపయోగించుకునే పరిస్థితి లేదు. మరోవైపు వైద్యారోగ్య సిబ్బంది కూర్చునేందుకు ప్లేస్‌ లేదు. సంబంధించిన నేతలు, అధికారుల అనాలోచిత నిర్ణయాల ఫలితంగా ఈ దుస్థితి తలెత్తింది. నిధులున్నాయని, ఖర్చు పెడితే కమిషన్లు వస్తాయన్న ఆశతో ప్రజాప్రతినిధులు, అధికారులు ఏమీ ఆలోచించలేదు. పర్యవసానంగా ఇది నిరుపయోగంగా మారింది.

గర్భిణులు, బాలింతలు, రోజుల వయసున్న శిశువులు, వృద్ధులు, చిన్నారులు టీకాల కోసం, వైద్య పరీక్షల కోసం నిత్యం వచ్చే వైద్య ఉపకేంద్రం ఏకంగా శ్మశానంలో నిర్మించడం వల్ల ఊరి జనం భయానికి లోనవుతున్నారు. ఏమాత్రం ఆలోచన లేకుండా చేపట్టిన ఈ నిర్మాణం వల్ల ఎవరికీ ఉపయోగం లేకపోగా, లేనిపోని ఇబ్బందులు వచ్చిపడ్డాయి. నిత్యం వైద్యారోగ్యశాఖకు చెందిన ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌వోలు వచ్చి కూర్చుని, ఆసుపత్రికి వచ్చిన వారిని పరీక్షించాల్సిన ప్రదేశం శ్మశానం పుణ్యమా అని వెలవెలపోతోంది.

ఎన్‌ఆర్‌హెచ్‌ఎం నిబంధనల ప్రకారం ప్రతి మండలానికి మినిమం ఒక ప్రాథమిక వైద్యకేంద్రం, ప్రతి ఐదువేల జనాభాకు ఒక ఆరోగ్య ఉపకేంద్రం ఉండాలి. టీకాలు, పరీక్షలు, నమూనా సేకరణ జరగాల్సిన ఈ కేంద్రం వద్దకే అందరూ వస్తుంటారు. ఒక గర్భిణి ప్రసవానంతరం పోస్ట్‌ హెల్త్‌ చెకప్‌ కోసం ప్రతిసారి పెద్దాసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, పుట్టిన శిశువుకు క్రమం తప్పని టీకాల కోసం ప్రతి సారీ వ్యవప్రయాసలకోర్చి దూరం పోవాల్సిన పనిలేకుండా ఉండేందుకు వైద్య ఉపకేంద్రం లోనే ఈ సేవలను అందుబాటులో ఉంచారు.

ఇంకా టీబీ టెస్టింగ్‌, హెచ్‌ఐవీ, కోవిడ్‌ టెస్ట్‌ల కోసం నమానాలను ఇక్కడ నుంచే సేకరిస్తారు. దీంతో వైద్య సహాయం అవసరమైన వాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడకు రావాల్సిందే. కానీ ఈ ఊళ్లో మాత్రం భయం వల్ల రాలేని పరిస్థితి ఉంది. జనం భయపడుతున్నారని, సిబ్బంది సైతం ఉపకేంద్రంలో కూర్చోడానికి భయపడుతున్నారు. అయినా అంతిమ సంస్కారం చేసే చోట వైద్య ఉపకేంద్రం నిర్మించడం ఏంటని.. కనీసం ఆలోచించకుండా ఇలా ఎలా చేస్తారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా దీనిపై దృష్టిసారించాలని జనం కోరుతున్నారు.

First published:

Tags: Mahabubabad, Treatment

ఉత్తమ కథలు