Santosh, News18, Warangal
ఉమ్మడి వరంగల్ జిల్లా (Warangal District) వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతంలో నేటికీ సరైన రోడ్లు లేవు. అటువంటి ప్రాంతాల వారు ఇంటి ప్రసవాలకి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితులు కారణంగా వారిలో మార్పులు వచ్చాయి. ఆసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా చూస్తున్నారు. అలాంటి వారికి 108 వాహనం ఆపద్బాంధవుడుగా నిలుస్తుంది. అయితే, అత్యవసర తప్పనిసరి పరిస్థితుల్లో కూడా ఆలస్యం అవుతుండడంతో చాలామంది గర్భిణీలు వాహనంలోనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. వీరికి 108 వాహనంలో పనిచేసే ఈఎంటిలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విశేష సేవలు అందిస్తున్నారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో ఎలాంటి సమయంలోనైనా ప్రసవాలు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తల్లి బిడ్డలను కాపాడుతున్నారు. ఆ తర్వాత ఆస్పత్రికి సురక్షితంగా తరలించి మరింత మెరుగైన వైద్యం అందించే విధంగా సేవలందిస్తున్నారు.
గర్భిణీ స్త్రీలకే కాకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి కూడా తమదైన శైలిలో సేవలందిస్తూ ప్రజలకు ఆదరణ పొందుతున్నారు. గత తొమ్మిది నెలలుగా 108 వాహనంలో ఈఎంటిగా విధులు నిర్వహిస్తున్న చైతన్య వివిధ రకాల కేసులను స్వయంగా చేశానని ప్రమాదంలో గాయపడిన వారు, గుండెపోటు, ఇతర సమస్యలతో అత్యవసరమైన వారిని ఎందరినో చూశానని, తాను పనిచేసే వాహనంలో 28 మంది గర్భిణీ స్త్రీలకు ప్రసవం చేశానని అలాంటి వారిని తీసుకెళ్లే సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ప్రతి నిమిషం వారిని పరీక్షిస్తూ ఉండాలని, పురిటి నొప్పులు ఎక్కువైతే మార్గ మధ్యలోనే ప్రసవం చేసే సందర్భాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలు అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంటుందని ఈఎంటి చైతన్య చెప్పారు.
108 వాహనంలో అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి అత్యవసర సేవలను అందిస్తున్నాం. 108 వాహనంలో వచ్చే కేసుల్లో దాదాపు 20 నుండి 30 శాతం వరకు ప్రసూతి కేసులే ఉంటాయి. ఎమర్జెన్సీ కాల్ రాగానే సంఘటన స్థలానికి చేరుకోవాల్సిన సమయానికి చేరుకొని చికిత్స అందిస్తున్నాం. ఎటువంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎప్పటికప్పుడు నిపుణులతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని, వేలాది మందిని ఆసుపత్రులకు తరలిస్తూ ప్రాణాలను కాపాడడం చాలా ఆనందంగా ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా 108 ప్రోగ్రాం అధికారి శివకుమార్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal