WANTS TO JOIN ARMY FOR BROTHERS AMBITION HIS SISTER ALSO IN BSF HERE TRAGIC STORY OF RAKESH WHO DIED IN AGNIPATH PROTEST AT SECUNDERABAD MKS
అక్క బీఎస్ఎఫ్ జవాన్.. అన్న కోసం ఆర్మీలో చేరాలనుకున్నాడు.. కానీ : రాకేశ్ విషాదాంతం
పోలీస్ కాల్పుల్లో చనిపోయిన రాకేశ్
సోదరి ఇప్పటికే దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోంది. ఆర్మీ కలలు కన్న సోదరుడు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అన్న ఆశయాన్ని సాధించడానికి.. అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్నాడు. కానీ అగ్నిపథ్ నిరసనల్లో పోలీస్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు..
ఆ కుటుంబంలోని పిల్లల గుండెల నిండా దేశభక్తి. సోదరి ఇప్పటికే దేశ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోంది. ఆర్మీ కలలు కన్న సోదరుడు అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అన్న ఆశయాన్ని సాధించడానికి.. అక్క స్ఫూర్తితో ఆర్మీలో చేరాలనుకున్నాడు. కానీ అగ్నిపథ్ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయాడు. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ (Agnipath Scheme Row) కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో జరిగిన నిరసనల్లో పోలీసు కాల్పుల్లో చనిపోయిన దామెర రాకేశ్ జీవితం చిన్న వయసులోనే విషాదంగా ముగిసింది. వివరాలివే..
సైన్యంలోకి వెళ్లాలన్న అన్న కోరిక నెరవేరలేదు. రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరగడంతో ఆ కల అలాగే ఉండిపోయింది. దానిని చెల్లెలు, తమ్ముడి ద్వారా తీర్చుకోవాలనుకున్నాడు. సైనికుల గాథలు చెప్పి వారిలో స్ఫూర్తి రగిలించాడు. సోదరి ఇప్పటికే బీఎస్ఎఫ్ జవాన్ కాగా, తమ్ముడు కూడా ఆ దిశగా ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. దురదృష్టవశాత్తు ‘అగ్నిపథ్’ ఆందోళనల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందాడు. ఆయనే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్‌పేటకు చెందిన దామెర రాకేశ్ (22).
వరంగల్ జిల్లాలోని దబీర్ పేటకు చెందిన కుమారస్వామి-పూలమ్మ రైతు దంపతులు. వీరికి రామ్‌రాజ్, రాకేశ్ కుమారులు. ఉష, రాణి కుమార్తెలు. ఉషకు పెళ్లయింది. రాణి ఆర్మీలో బీఎ్‌సఎఫ్ కానిస్టేబుల్‌గా బెంగాల్‌లో ఉద్యోగం చేస్తున్నారు. 2015లో నర్సంపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు, చేయి విరగడంతో రామ్‌రాజ్ ఇంటివద్దే ఉంటున్నారు. తమ్ముడు రాకేశ్ సైన్యంలో చేరితే తన కల నెరవేరినట్లే అనుకున్నారు.
ఆ కుటుంబంలో చిన్నకొడుకైన రాకేశ్ దబీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో టెన్త్, నర్సంపేటలో ఇంటర్ పూర్తి చేశాడు. హనుమకొండలోని న్యూసైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. రెండేళ్లుగా ఆర్మీ ఉద్యోగం కోసం పరీక్షలకు హాజరయ్యారు. గత ఏడాది హకీంపేటలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొని అన్ని ఈవెంట్లలో ఎంపికయ్యారు. ఇటీవల ఆర్మీ (బీఎ్‌సఎఫ్) సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాల శరీర దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. హనుమకొండలో ఉంటూ రాత పరీక్షల కోచింగ్ తీసుకుంటున్నారు.
రెండేళ్లుగా వాయిదా పడుతోన్న ఆర్మీ రిక్రూట్మెంట్లు పూర్తిగా రద్దయిపోతాయని, ఇకపై అగ్నిపథ్ పథకం ద్వారానే నియామకాలు జరుగుతాయనే సమాచారం రాకేశ్ తోపాటు అభ్యర్థులు అందరినీ కలవరపెట్టింది. అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ ఎప్పుడు చేపడతారనే క్లారిటీ రాలేదు. కేంద్రం కొత్తగా ప్రకటించిన అగ్నిపథ్ పథకంతో తీవ్ర నిరాశకులోనైన రాకేశ్ లాంటి అభ్యర్థులందరూ వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. కేంద్రం తీరుపై నిరసన తెలపడానికి అతను హన్మకొండ నుంచి శుక్రవారం ఉదయం సికింద్రాబాద్‌కు రైలులో వెళ్లారు.
సికింద్రాబాద్ స్టేషన్ లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారి, రైళ్లను తగులబెట్టడం, స్టేషన్ ను ధ్వంసం చేయడం లాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో వారిని కంట్రోల్ చేసేందుకు రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో రాకేశ్ మృతి చెందారు. ఆర్మీలో చేరడమే కలగా బతికిన రాకేశ్ అది సాధించాలనే పట్టుదలతో నిత్యం పోటీ పరీక్షల గురించే చర్చించేవాడని తోటి మిత్రులు, కుటుంబీకులు చెబుతున్నారు. రాకేశ్ మృతి విషయం తెలిసి నానమ్మ చిలుకమ్మ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
గాంధీ ఆస్పత్రిలో ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత రాకేశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు తెలంగాణ పోలీసులు. అగ్నిపథ్ నిరసనల కాల్పుల్లో రాకేశ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ దుర్మార్గ విధానాల వల్లే యువత బలవుతోందని మండిపడ్డారు. రాకేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం, అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బెంగాల్ నుంచి సోదరి ఉష వచ్చాక రాకేశ్ అంత్యక్రియలు జరుపుతామని కుటుంబీకులు తెలిపారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.