(Syed Rafi, News18,Mahabubnagar)
తల్లిదండ్రుల్ని దైవంగా పూజించే సంస్కృతి నుంచి ఆస్తులు, డబ్బుల కోసం బిడ్డలే అత్యంత కిరాతంగా హతమార్చుతున్న పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని వనపర్తి (Wanaparthy) జిల్లాలో ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడో కొడుకు. జిల్లాలోని కొత్తకోట మండలం అమడవాకుల గ్రామానికి చెందిన రాములు (Ramulu)అనే వ్యక్తి కన్నతల్లి శంకరమ్మ(Shankaramma)ను దారుణంగా హతమార్చి..ఇంటి ముందున్న సంపులో పడేశాడు. నవమాసాలు మోసి పెంచి ప్రయోజకుడ్ని చేసిన తల్లి పట్ల ఇంతటి దారుణానికి ఒడిగట్టిన విషయం తెలుసుకొని స్థానికులు షాక్ అయ్యారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రాములు, అతని భార్యకు దేహశుద్ధి చేసి పోలీసు(Police)లకు అప్పగించారు.అయితే కన్నతల్లిని కొడుకు హతమార్చాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందనే విషయం తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
తల్లిని చంపి నూతిలో పడేశాడు..
వనపర్తి జిల్లాలోని కొత్తపేట మండలం అమడవాకుల గ్రామానికి చెందిన శంకరమ్మ అనే వృద్ధురాలి మృతదేహం ఇంటి ముందున్న సంపులో శవమై కనిపించింది. గత కొన్ని నెలలుగా నడవలేని స్థితిలో ఉండడంతో ఆమె కొడుకు రాములు తల్లిని భరించలేక సోమవారం రాత్రి హత్య చేసి సంపులో పడేశారు. ఉదయం గ్రామస్తులు చుట్టుపక్కల వారు శంకరమ్మ కనిపించకపోవడంతో ఇంటి ముందు ఉన్న సంపులో చూశారు. శంకరమ్మ మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా కోపోద్రేకులయ్యారు. శంకరమ్మ మృతదేహాన్ని బయటకు తీసి కుమారుడు, కోడలు ను దేహశుద్ధి చేశారు గ్రామస్తులు. అనంతరం పోలీసులకు సమాచారం చేరవేసారు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు శంకరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొడుకు రాములు, కోడల్ని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన వివరాల కోసం చుట్టు పక్కల వాళ్ల నుంచి స్టేట్‌మెంట్ తీసుకున్నారు.
వృద్దాప్యమే శాపమా..?
పసివాళ్ల దగ్గర నుంచి పిల్లల్ని అల్లారుముద్దుగా చూసుకునే తల్లిదండ్రుల పట్ల బిడ్డలు ఇంతటి కర్కశంగా ప్రవర్తిస్తుండటంపై స్థానికులు తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఆస్తులు, డబ్బు, నగల కోసం కొందరు తల్లిదండ్రుల్ని కడతేర్చుతుంటే..మరికొందరు చెడు వ్యసనాలకు బానిసలై కన్నవాళ్లను పొట్టనపెట్టుకుంటున్నారు. అయితే వనపర్తి జిల్లాలో జరిగిన ఓ మాతృమూర్తి హత్య మాత్రం కేవలం వృద్ధాప్యమే బిడ్డలకు సమస్యగా మారడం చూసి కన్నీరు పెట్టుకున్నారు. చివరి దశలో కన్నవాళ్ల రుణం తీర్చుకోవాల్సింది పోయి..తల్లిని చంపి నూతిలో పడేసిన రాముల్ని విడిచిపెట్టవద్దని ..ఉరి శిక్ష విధించాలని స్థానికులు పోలీసుల్ని కోరారు.
ఉరితీయాలంటున్న స్థానికులు..
వృద్దురాలి హత్య కేసులో కూతురు బాలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నాగ శేఖర్ రెడ్డి తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నామని..పోస్ట్‌మార్టం రిపోర్ట్, పూర్తి వివరాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana crime news, Wanaparthi