corona help : తల్లికి కరోనా, ఇండియా చేరుకున్న ఎన్నారై.... తర్వాత ఏం చేశాడు...

తల్లికి కరోనా, ఇండియా చేరుకున్న ఎన్నారై.... తర్వాత ఏం చేశాడు...

khammam : తల్లికి కరోనా సోకితే పట్టించుకున్నా నాథుడు కరువయ్యారు..దీంతో తల్లి కోసం యూఎస్‌లో ఉంటున్న ఓ ఎన్నారై ఇండియా వచ్చాడు..అనంతరం తన తల్లిలాగా ఎవరు ఇబ్బంది పడకూడని భావించి, పలు స్వఛ్చంధ సేవ సంస్థల సహకారంతో ఏకంగా ఐసోలేషన్ సెంటర్‌నే ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పోందుతున్నారు..

  • Share this:
జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు, ఖమ్మం జిల్లా కరస్పాండెంట్‌

ఇప్పుడు కరోనా విశ్వవ్యాప్త విలయం. ఈ వైరస్‌ బారిన పడి ఆసుపత్రుల పాలై.. లక్షలకు లక్షలు ఫీజులు చెల్లించి.. ఆనక అప్పుల పాలై ఇల్లు గుల్లవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.. వింటున్నాం. కొన్నికేసుల్లో ఎన్ని లక్షలు ఖర్చు చేసినా బతికితే చాలని మొక్కుకున్నా.. ఆ పరిస్థితీ లేదు. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు లేక.. ఉన్న బెడ్లలో ఒకటి కొత్తవాళ్లకు కేటాయించాలంటే ఎవరో ఒకరు 'ఏదో ఒక రకంగా' డిశ్చార్జి కావాల్సిందే. ఖమ్మం ప్రధాన ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్‌ బెడ్లు ఉన్నది 320. దాదాపు గత నెల రోజులుగా ఏ రోజూ ఒక్కటంటే ఒక్కటి కూడా ఖాళీల్లేవ్‌. ఇక ప్రవేటు సంగతి చెప్పనక్కర్లేని పరిస్థితి.

కోవిడ్‌ పాజిటివ్‌ ఉండి. . సాధారణంగా ఉన్న వారికి ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసినా డిమాండ్‌ తీరని పరిస్థితి. కొన్నిసార్లు ఊరికి దూరంగా ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్‌ సెంటర్‌లలో ఉండడానికి పాజిటివ్‌ వచ్చిన వాళ్లు సుముఖత చూపడం లేదు. దీంతో స్తోమత ఉన్నవాళ్లు ప్రవేటు ఆసుపత్రుల బాట పట్టినా.. ఎలాంటి ఆర్థిక స్తోమత లేని.. ఇంటివద్ద ఐసోలేషన్‌లో ఉండే వసతి లేని పేద బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాల వారి సేవల కోసం పలు స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో ఓ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

బోడేపూడి విజ్ణాన కేంద్రం (బీవీకే) ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ సేవలకు నిర్మల్‌హృదయ్‌ స్కూల్‌ భవనాన్ని వినియోగిస్తున్నారు. మే నెల 12 వ తేదీన ప్రారంభమైన ఈ కేంద్రంలో ప్రస్తుతం 40 బెడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా 14 మంది ఇక్కడి సేవలు పొంది, నెగెటివ్‌ రిపోర్టుతో సంతోషంగా ఇంటిబాట పట్టారు. ఇలా పాజిటివ్‌ వచ్చి ఇక్కడ చేరిన వారందరినీ నిత్యం పర్యవేక్షిస్తూ, రోగుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం.. ప్రతి నాలుగు గంటలకు ఆక్సిజన్‌ లెవల్స్‌, పల్స్‌, బీపీ చెక్ చేయడానికి ఇక్కడొక నర్స్‌ను నియమించారు. ఖమ్మం నగరంలోని ప్రముఖ వైద్యులు నిత్యం రెండు షిఫ్టులలో వచ్చి ప్రత్యక్షంగా పరీక్షలు చేసి వెళ్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ..

బీవీకే ఐసోలేషన్‌ సెంటర్‌లో ఏర్పాటైన నలభై బెడ్లలో ఉన్న పేషంట్లను నిత్యం నిపుణులైన వైద్యులు పరిశీలిస్తున్నారు. స్త్రీ, పురుషుల కోసం వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ లెవల్స్‌ను పరిశీలిస్తూ.. ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిని అన్ని సదుపాయాలున్న ఆసుపత్రులలో చేర్చే ఏర్పాటు చేస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఉదయాన్నే ఆరున్నరకు వేడి వేడి టీ.. 7 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌, 11 గంటలకు జ్యూస్‌ లేదా జావ, మధ్యాహ్నం 12 గంటలకు మూడు కూరలు, పెరుగుతో మంచి భోజనం, 4 గంటలకు చిరుధాన్యాలు (గుగ్గిళ్లు\మొలకెత్తిన విత్తనాలు\డ్రైఫ్రూట్స్‌), తిరిగి రాత్రి ఏడు గంటలకు భోజనం.. ఇలా నిత్యం రెండు పూటలా ఉడికించిన గుడ్లను సైతం ఉస్తూ రోగులకు పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు.

ఇలా బీవీకేలోని ఐసోలేషన్‌లో ఉన్నవారితో పాటు, ఇళ్ల వద్ద ఐసోలేషన్‌లో ఉన్నవారికి సైతం ఓ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేసి, ఇంటివద్దకే భోజనాన్ని సరఫరా చేస్తున్నారు. ఇక్కడి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌తో పాటు, సొంత ఇళ్లలో ఐసోలేషన్‌లో ఉన్నవారికి సైతం మందులను ఉచితంగా పంపిణీ చేస్తుండడం విశేషం. ఈ సేవలను బీవీకే పర్యవేక్షిస్తుండగా దీనికి అండగా ఎన్‌ఆర్‌ఐ ఫౌండేషన్‌, ఎన్‌ఆర్‌ఐ పేరెంట్స్‌ అసోసియేషన్‌, సత్యసాయిసేవాసమితి, చేతన, సుగంధ, సువిధ, గురుదక్షిణ పౌండేషన్‌, లయన్స్‌క్లబ్‌, రోటరీక్లబ్‌ సహా తానా, ఇంకా జనవిజ్ణాన వేదికలు సంయుక్తంగా నిర్వహిస్తుండగా.. ప్రత్యక్షంగా ఇక్కడి పేషంట్లకు అందుతున్న సేవలను బీవీకే కార్యదర్శి వై.శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు.

ఇక ఇక్కడి పేషంట్లను నిత్యం ఖమ్మం నగంరలోని ప్రముఖ వైద్య నిపుణులైన సి.భారవి, వై. రవీంద్రనాథ్‌, పొన్నం సుబ్బారావు, సుమంత్‌, జీవీ, మురళీకృష్ణ, అనుదీప్‌, శ్రీహర్ష లాంటి వారితో పాటు గుంటూరు మెడికల్‌ కాలేజి ప్రొఫెసర్‌ బాబూరావులు వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు.కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిన వారిని సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేస్తున్న పరిస్థితుల్లో ఇలా స్వచ్ఛంధ సంస్థలు ముందుకు రావడం వల్ల ఎంతోమందికి మేలు జరుగుతోంది.

నిత్యం వేలాది మందికి పాజిటివ్‌ వస్తున్న పరిస్థితుల్లో అన్ని రకాల సేవలూ ప్రభుత్వం నుంచి అందాలంటే ఆచరణ సాధ్యం కాదు. దీన్ని అధిగమించడానికి ఇలా ఏకమైన లైక్‌మైండెడ్‌ స్వచ్ఛంధ సంస్థలన్నీ ఒక వేదికను ఏర్పాటు చేసి, కష్టంలో ఉన్న వారికి అండగా నిలుస్తున్నామంటున్నారు ఈ ఐసోలేషన్‌ సెంటర్‌కు ఆద్యులైన ఎన్నారై బాబు బయ్యన. యూఎస్‌లో ఉంటున్న తాను.. ఖమ్మంలో నివాసం ఉంటున్న తన తల్లికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్థరణ అయితే కనీసం మెడిసిన్స్‌, ఫుడ్‌ లాంటివి ఇవ్వడానికి కూడా తన బంధువులు, స్నేహితులు ముందుకు రాలేదని.. దీంతో రాత్రికి రాత్రే టికెట్‌ బుక్‌ చేసుకుని ఇండియాకు వచ్చేశానని.. తనలా ఎవరూ ఇబ్బంది పడకూడదని, కోవడ్‌ పాజిటివ్‌ వచ్చిన ఎవరూ ఐసోలేషన్‌లో ఇబ్బందులు పడరాదన్న భావనతో దీన్ని మొదలుపెట్టామని బాబు బయ్యన చెప్పారు.

బీవీకే ఐసోలేషన్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఆయన 'న్యూస్‌18 తెలుగు' ఖమ్మం జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ కొన్ని కేసుల్లో ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నవారు కూడా మానసికంగా నిర్వీర్యం అవుతున్న పరిస్థితులు చూశానని, ఇలా ఒకచోట ఐసోలేషన్‌ సెంటర్‌ పెట్టడం వల్ల పేషంట్లు భయానికి గురికావడం లాంటి వాటిని నివారించవచ్చన్నారు. తన స్వానుభవం వల్లే ఇలాంటి సేవల అవసరాన్ని గుర్తించినట్టు ఆయన చెప్పారు. ఇలాంటి సేవలు అందించడానికి ముందుకొచ్చే సంస్థలు, వ్యక్తులకు ప్రభుత్వ అనుమతుల విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని సూచించారు. భవిష్యత్తులో తమ ఎన్నారై ఫౌండేషన్‌ సేవలను కొత్తగూడెం, భద్రాచలం, కల్లూరు ప్రాంతాలకు విస్తరించే ప్రణాళిక ఉందన్నారు
Published by:yveerash yveerash
First published: