(G.SrinivasReddy,News18,Khammam)
భద్రాద్రి(Bhadrari) ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. సీతారాముల అన్నప్రసాదంగా ఒక వ్యక్త వర్దంతి భోజనాన్ని వడ్డించడంతో ఒక్కసారిగా భక్తులు ఆగ్రహానికి లోనయ్యారు. భక్తుల విశ్వాసాలను ఫణంగా పెట్టి మరీ ఆలయ అధికారులు ఎవరినో ప్రసన్నం చేసుకోడానికి ప్రయత్నించారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇది సీతారాముల పరంగా అపచారంగానే పరిగణించాల్సిన విషయం అని పురోహితులు సైతం వాపోతున్నారు. దక్షిణాది అయోధ్యగా భక్తులు విశ్వసించే భద్రాద్రిలో ఇలా అపచారం చోటుచేసుకోవడంపై రగడ రగులుకుంటోంది. చివరకు ఇది ఎటు దారితీస్తుందో, ఏ రూపం తీసుకుంటుదో తెలీని పరిస్థితి నెలకొంది. భద్రాద్రి శ్రీసీతారాముల ఆలయంలో కొన్నేళ్లుగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది. దీనికోసం భక్తుల నుంచి విరాళాలు స్వీకరించడమూ ఆనవాయితీగానే వస్తోంది.
అయితే గత మంగళవారం నాడు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ వద్ద ఒక వ్యక్తి 50వ వర్దంతి అంటూ ఫ్లెక్సీ పెట్టడంతో కలకలం రేగింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దీన్ని గుర్తించకపోయినా, స్థానికులు దీన్ని గుర్తించి ప్రశ్నించడంతో గొడవ చోటుచేసుకుంది. అనంతరం చేసిన తప్పును సరిచేసుకుంటూ ఆలయ అధికారులు ఫ్లెక్సీని తొలగించారు. అయితే భక్తులు స్వామివారి పట్ల విశ్వాసంతో ఎవరి పేరున చందాలు, విరాళాలు ఏరూపంలో ఇచ్చినా, ఏ నిమిత్తం ఇచ్చినా ఎక్కడా ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించిన దాఖలా లేదు.
కానీ మంగళవారం నాడు జరిగిన ఈ ఘటన అధికారులు చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని, ఎవరినో సంతృప్తి పరుస్తూ తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోడానికి చూపుతున్న తాపత్రయాన్ని చాటినట్లయింది. ఇది తీవ్ర విమర్శలకు దారితీయడంతో వెంటనే ఫ్లెక్సీని తొలగించినా, స్థానికంగా మాత్రం నిరసన వ్యక్తం అయింది. ఓ మాజీ అధికారి వర్దంతి కావడంతో ఆలయ పరిపాలనా బాధ్యులు ఇలా ప్రవర్తించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు నిత్యాన్నదానం సత్రం వద్ద వర్దంతుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దారుణమైన అపచారంగా భావిస్తున్నారు. భక్తులు పరమ పవిత్రంగా భావించే అన్నప్రసాదం బదులుగా వర్దంతి భోజనం పెట్టడం ఏంటన్న ప్రశ్న అందరినీ కలచి వేస్తోంది.
నిత్యం వందలాది మంది పవిత్రంగా స్వీకరించే అన్నప్రసాదం పవిత్రతను ఇలా అపవిత్రం చేస్తున్నారని ఆలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకరరెడ్డి వాపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారులు, అర్చకులు ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bhadrari kothagudem, Khammam