టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్(BRS)గా మారిన తర్వాత .. జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ (CM KCR) స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్తీ విస్తరణకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ (Telangana) సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్రల్లో ముందుగా పార్టీని విస్తరించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణలో కేసీఆర్ పాలన అద్భుతంగా ఉందని.. తమను కూడా తెలంగాణలో కలపాలని మహారాష్ట్రలోని కొన్ని గ్రామాలు కోరుతున్నాయి. మహారాజ్ గూడ, నాకేవాడ సహా మొత్తం 14 గ్రామాల ప్రజలు.. తమను తెలంగాణలో కలుపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలంగాణ సరిహద్దులోని పలు మహారాష్ట్ర గ్రామాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. వృద్ధులకు వెయ్యి రూపాయల పింఛన్, 10 కిలోల రేషన్ బియ్యంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే వారు తమ గ్రామాలను తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. అందుకోసం మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాము తెలంగాణలో కలిస్తే.. మరిన్ని ప్రయోజనాలు దక్కుతాయని అభిప్రాయపడుతున్నారు.
Maharashtra | Villagers of 14 villages including Maharajguda, Nake Wada that are situated on the border of Maharashtra-Telangana border express their willingness to join Telangana as the issue of border areas fuels up in Maharashtra pic.twitter.com/JYquZUgSdO
— ANI (@ANI) December 14, 2022
మహారాష్ట్ర ప్రభుత్వం కంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎక్కువ ప్రయోజనాలు అందుతున్నాయి. అందుకే ఇక్కడి ప్రజలు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారు. మా గ్రామంలోని వృద్దులకు తెలంగాణ ప్రభుత్వం వెయ్యి రూపాయల పెన్షన్ ఇస్తోంది. 10 కేజీల రేషన్ బియ్యం కూడా వస్తున్నాయి. అని నాకేవాడ గ్రామానికి చెందిన విజయ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ మంచి పథకాలనుఅమలు చేయడం వల్లే ఇక్కడి ప్రజలు తెలంగాణలో కలవాలని కోరుకుంటున్నారని నాకేవాడ ఉపసర్పంచ్ సుధాకర్ జాదవ్ తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు మరిన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తే.. ఈ సమస్య ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.
మరోవపు మహారాష్ట్ర ప్రజా ప్రతినిధులు మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడి ప్రజల్లో 70- 80 శాతం మంది మహారాష్ట్రలోనే ఉండాలని కోరుకుంటున్నారని రాజురా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుభాష్ ధోటే తెలిపారు. చాలా తక్కువ శాతం మంది తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుతున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కూడా మంచి పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
కాగా, తెలంగాణలో రైతు బంధు, రైతుబీమా, వృద్ధాప్య పెన్షన్లు, కేసీఆర్ కిట్, దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ వంటి పథకాలు అమలవుతున్నాయి. వీటి పట్ల మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. తాము కూడా తెలంగాణలో కలిస్తే.. తమకూ ఆ ప్రయోజనాలు దక్కుతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే వారంతా తెలంగాణలో కలిసేందుకు ఇష్టపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.