రేషన్ బియ్యం వండే ముందు ఆమె ఓసారి జాగ్రత్తగా గమనించింది.. అంతే షాక్, ఆ తర్వాత ఊరంతా గోల

ప్రతీకాత్మక చిత్రం

బియ్యంలో యూరియాను కలిపి కల్తీకి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు మంచి బియ్యం ఇవ్వాలని మర్కగూడ గ్రామస్తులు కోరుతున్నారు.

 • Share this:
  పేదల ఆకలి తీర్చుతున్న రేషన్ బియ్యంలో యూరియా ప్రత్యక్షమైంది. అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఎప్పటిలాగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మర్కగూడ గ్రామంలోని చౌకధరల దుకాణంలో రాయితీపై బియ్యాన్ని పంపిణి చేశారు. అక్కడి గిరిజనులు వచ్చి తీసుకువెళ్ళారు. అయితే రేషన్ బియ్యంలో యూరియా రావడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మర్కగూడ కొలాం గిరిజనులు గత రెండు మూడు రోజులుగా చౌక ధరల దుకాణానికి వచ్చి బియ్యం తీసుకెళ్తున్నారు. బియ్యంలో యూరియా రావడం గమనించిన గ్రామస్థులు పలువురి ఇళ్ళల్లో పరిశీలించారు. అందులో యూరియా కలిసి ఉండటంతో డీలర్ ను ప్రశ్నించారు. తనకేమి తెలియదని, వచ్చిన బియ్యం గ్రామస్థులకు పంపిణి చేసినట్లు చెప్పడంతో బియ్యంలో యూరియా కలిసిన విషయాన్ని గ్రామస్థులు మండల అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో తహసీల్దార్ రాఘవేందర్ రావు, పౌరసరఫరాల శాఖకు చెందిన ఉద్యోగి సుధాకర్, విఆర్వో చౌకధరల దుకాణానికి వచ్చి బియ్యాన్ని పరిశీలించి అందులో యూరియా కలిసి ఉన్న విషయాన్ని నిర్దారించారు. బియ్యం పంపిణిని తాత్కాలికంగా నిలిపివేశారు. యూరియా కలిసి బియ్యాన్ని తిరిగి చౌక ధరల దుకాణంలో అప్పగించాలని గ్రామస్థులకు సూచించారు.

  బియ్యంలో యూరియా కలిసిన విషయాన్ని గమనించడంతో ప్రమాదం తప్పిందని, తెలియక ఎవరైనా ఆ బియ్యం తిని ఉంటే అనారోగ్యం పాలయ్యేవారని గ్రామస్థులు వాపోయారు. యూరియా కలిసిన బియ్యాన్ని వెనక్కి తీసుకుని తమ డబ్బులు తిరిగి చెల్లించాలని, బియ్యంలో యూరియాను కలిపి కల్తీకి పాల్పడిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు మంచి బియ్యం ఇవ్వాలని మర్కగూడ గ్రామస్తులు కోరుతున్నారు.

  రేషన్ బియ్యంలో రాళ్లు, నూకలు చూసి ఉంటారు. కానీ, ఏకంగా యూరియా రావడం చూసి జనం హడలిపోయారు. అయితే, అసలు యూరియా ఎలా వచ్చిందనేది ఇప్పుడు ప్రశ్న. మరోవైపు కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టు ప్రతి ఒక్కదాన్ని కల్తీ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కల్తీ చేసిన వారు పట్టుబడినా కూడా మళ్లీ కొన్ని రోజులు, నెలల్లోనే జైలు నుంచి బయటకు వస్తున్నారు. ఆ తర్వాత మరోచోట, మరో రకమైన కల్తీలు చేస్తున్నారు. దీంతో కల్తీలకు అడ్డుకట్ట వేయడం చాలా కష్టం అవుతోంది. అయితే, పాలు కల్తీ చేసినందుకు నిందితుడికి ఏకంగా ఓ కోర్టు 24 సంవత్సరాల తర్వాత కూడా జైలు శిక్ష విధించింది. అది ఎక్కడో విదేశాల్లో కాదు. మన దేశంలోనే ఉత్తరప్రదేశ్‌కి చెందిన పాల వ్యాపారి రాజ్ కుమార్ పాలలో నీళ్లు కలిపేశాడు. 1995లో జరిగిందీ ఘటన. ఈ పాలపై కొందరు అభ్యంతరం చెప్పారు. కల్తీ పాలు అమ్ముతున్నాడని కేసు పెట్టారు. దీనిపై అప్పటి ప్రభుత్వ ఎనలిస్ట్... పాలను పరీక్షించారు. పాలలో ఫ్యాట్ 4.6 శాతం ఉంది. మిల్క్ సాలిడ్ నాన్ ఫ్యాట్ (MSNF) 7.7 శాతం ఉంది. నిజానికి ఆహార కల్తీ నియంత్రణ చట్టం ప్రకారం అది 8.5 శాతం ఉండాలి. దాంతో రాజ్ కుమార్‌ను ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. ఈ తీర్పును సెషన్స్ కోర్టు, హైకోర్టు సమర్థించాయి. చివరకు సుప్రీంకోర్టు కూడా కింది కోర్టుల తీర్పును సమర్థించింది. ఫలితంగా చేసిన నేరానికి 24 ఏళ్ల తర్వాత శిక్ష అమలవుతోంది.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: