(P.Mahendar,News18,Nizamabad)
దేశభక్తిని గుండెల నింపుకొని భారతమాత(Mother India)నే ఆరాధ్యదైవంగా భావించే గొప్ప వాళ్లున్నటువంటి గ్రామం అది. అందరూ దేవుళ్లు, దేశోద్దారకులకు విగ్రహాలు ప్రతిష్టించి, ఆలయాలు నిర్మిస్తే ..అక్కడి జనం మాత్రం భారతమాతకే గుడి కట్టించి పూజలు చేస్తున్నారు. భక్తి, శ్రద్ధలతో నిత్యం పూజలు చేయడమే కాదు ఏటా ఉత్సవాలు నిర్వహిస్తూ దేశభక్తిని చాటుకుంటున్నారు. దేశంలో కాశీ (Varanasi)తర్వాత రెండో భారతమాత మందిరంగా ప్రసిద్ధిగాంచింది. కామారెడ్డి (Kamareddy)జిల్లాలోని బిచ్కుంద(Bichkunda)మండల కేంద్రంలోని భారతమాత ఆలయం.
50ఏళ్ల క్రితం విగ్రహ ప్రతిష్టాపన..
భూమండలంలో అనేక దేవతలు, దేవుళ్లు ఉన్నారు. అందరికి వేర్వు ప్రాంతాల్లో అనేకమైన ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. కాని భారతమాతకు మాత్రం కేవలం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠం ప్రాంగణంలో మాత్రమే ఆలయం ఉంది. పాలరాతితో చెక్కబడిన ఆ ఆలయమే దేశంలో మొట్టమొటది భారతమాత దేవాలయం. దేశమాతపై ఉన్న భక్తిని చాటుకునేందుకు దేశభక్తులు నిర్మించిన ఆలయం ఇది. అంతటి ప్రాశస్త్యం కలిగిన మరో ఆలయం తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఉంది. దేశంలోనే రెండో భారతమాత ఆలయంగా పూజలందుకుంటున్న ఈ ఆలయ నిర్మాణం వెనుక 72ఏళ్ల చరిత్ర దాగి ఉంది. ఈ ప్రాంతానికి చెందిన పిస్క లక్ష్మయ్య అనే స్వాతంత్ర్య సమరయోధుడు 1950లో భారతమాత తానే స్వయంగా భారతమాత విగ్రహాన్ని చెక్కారు. అటుపై ఆలయ నిర్మాణానికి బీజం వేశారు.
గుడిసెలోంచి గుడిలోకి చేరిన భారతమాత..
మొదట ఓ గుడిసెలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత నక్క (మంగలి) రామన్న, బుర్రి గంగారాం సహకారంతో మందిర నిర్మాణం మొదలు పెట్టారు. ఆలయం కోసం కావాల్సిన స్తలాన్ని ఇచ్చేందుకు దాతలు ముందుకొచ్చారు. ఆలయ నిర్మాణపు పనులు నడుస్తుండగానే దేశభక్తితో తాము సైతం అంటూ స్థానిక పద్మశాలి సంఘం ముందుకొచ్చింది. పెండింగ్ పనులను పూర్తి చేసి 1982 ప్రాంతంలో ఇక్కడ నవగ్రహాలతో పాటు పలు దేవతా విగ్రహాలను కూడా ప్రతిష్టించారు. ప్రతి రోజూ దీప ధూప నైవేద్యాలు సమర్పించేందుకు పూజారిని కూడా నియమించారు. అంతే కాదు ప్రతి ఏటా మార్గశిర శుక్ల షష్ఠి రోజున భారతమాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే దేవతల ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల తరహాలో నిర్వహిస్తారు.
ఏటా భారతమాతకు ఉత్సవాలు..
ఏటా భారతమాత జయంతి రోజున ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహిస్తారు. అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్నాటకల నుంచి కూడా దేశభక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి దేశభక్తిని చాటుకోవడంతో పాటు భారతమాత గుడిలో మొక్కులు తీర్చుకుంటారు. భారతదేశ విశిష్టత గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఈ ఆలయం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతే కాదు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల రోజున జాతీయ జెండాను ఎగరేస్తారు.దేశ వ్యాప్తంగా చూసుకుంటే కాశీ తర్వాత ఇదే భారతమాత రెండో దేవాలయంగా ప్రసిద్దిగాంచింది. ఇంతటి చరిత్ర, దేశభక్తిని చాటుకుంటున్న ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తే బాగుంటుందని స్థానికులు కోరుతున్నారు. భారత దేశంలో ఎక్కడా లేని విధంగా బిచ్కుందలో భారతమాత మందిరం ఉండేలా చూడాలని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.